ఒకప్పుడు భారతదేశంలో ఇల్లు కొనడం అంటే రిటైర్మెంట్ దశలో చేసే పనిగా ఉండేది. 45 నుంచి 50 ఏళ్ల మధ్యలో పక్కాగా ప్లాన్ చేసుకుని సొంత ఇల్లు సమకూర్చుకునేవారు. కానీ, 2025 నాటికి ఈ ధోరణి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం దేశంలో కొత్తగా ఇళ్లు కొంటున్న వారిలో 16 శాతం మంది 30 ఏళ్ల లోపు యువతే ఉండటం మార్కెట్ నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. 2022లో ఈ శాతం కేవలం 9 శాతమే మాత్రమే ఉండేది. అంటే మూడేళ్లలోనే యువ కొనుగోలుదారుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ఇది కేవలం ఆర్థిక వృద్ధినే కాకుండా, యువతలో మారుతున్న జీవనశైలి ఆలోచనలను కూడా ప్రతిబింబిస్తోంది.
మెట్రో నగరాల్లో అద్దెలు ఆకాశాన్ని తాకుతుండటంతో, ఐటి , ఇతర కార్పొరేట్ రంగాల్లోని యువత కొత్త లెక్కలు వేస్తున్నారు. నెలకు రూ. 40,000 నుంచి రూ. 50,000 అద్దె కట్టడం కంటే, దానికి మరికొంత సొమ్ము జత చేసి ఈఎంఐ కట్టడం ద్వారా ఆస్తిని సొంతం చేసుకోవచ్చని వారు భావిస్తున్నారు. అద్దె అనేది ఖర్చు, ఈఎంఐ అనేది పెట్టుబడి అనే సూత్రం నేటి యువతను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేస్తూ అధిక వేతనాలు పొందుతున్న వారు, కెరీర్ ప్రారంభంలోనే గృహ రుణాల ద్వారా స్థిరాస్తిని పెంచుకుంటున్నారు.
ఈ తరం యువత కేవలం నాలుగు గోడల ఇల్లు మాత్రమే కోరుకోవడం లేదు. వారు క్లబ్ హౌస్, జిమ్, కో-వర్కింగ్ స్పేస్ , స్మార్ట్ హోమ్ ఫీచర్లు ఉన్న ప్రీమియం అపార్ట్మెంట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 2025 గణాంకాల ప్రకారం, రూ.1 కోటి కంటే ఎక్కువ విలువ గల ఇళ్ల విక్రయాల్లో 20 శాతం వాటా యువతదే ఉంటోంది. ఐటి కారిడార్లు ఉన్న హైదరాబాద్, బెంగళూరు , పూణే వంటి నగరాల్లో ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. టెక్నాలజీతో అనుసంధానమైన స్మార్ట్ లివింగ్ వారి ప్రాధాన్యతగా మారుతోంది.
గృహ రుణాల ప్రక్రియ డిజిటల్ మయం కావడం కూడా ఈ మార్పుకు ప్రధాన కారణం. ఫిన్టెక్ సంస్థలు , బ్యాంకులు కేవలం కొన్ని క్లిక్లతో లోన్ అర్హతను తెలియజేస్తుండటంతో, యువతకు ఇల్లు కొనే ప్రక్రియ సులభతరమైంది. దీనికి తోడు, తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆర్థిక సహాయం కూడా వీరికి అదనపు బలంగా మారుతోంది.
