Ghaati Movie Review
తెలుగు రేటింగ్: 2.25/5
క్రిష్ పై గట్టి నమ్మకం ఉంది ప్రేక్షకులకు. ఎప్పుడూ ఓ మంచి కథ చెప్పే ప్రయత్నమే చేస్తారాయన. విలువలు, మనుషులు, సమాజం.. వీటి చుట్టూ ఆయన కథలు తిరుగుతూ ఉంటాయి. ఉత్తమ చిత్రాలకు ఆయన కేరాఫ్‌గా నిలిచారు. క్రిష్ లాంటి దర్శకుడు ఓ కమర్షియల్ కథ చెప్పాలనే ప్రయత్నం చేయడం కచ్చితంగా ఆసక్తిని పెంచుతుంది. ఆ కథలో అనుష్క లాంటి స్టార్ ని తీసుకొని రావడం, ఆమెను ఓ యాక్షన్ హీరోలా చూపించాలనుకోవడం.. ఇవన్నీ ‘ఘాటీ’పై ఫోకస్ పెంచేశాయి. మరి ఘాటీ ఎలా ఉంది? శీలావతిగా అనుష్క నటన ఏ మేరకు మెప్పించింది? సహజ సిద్ధమైన కథలతో ఆకట్టుకొనే క్రిష్.. కమర్షియల్ మీటర్ లో ఓ కథని ఎలా చెప్పగలిగారు?
ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న తూర్పు కనుమల్లో అతి అరుదుగా పెరిగే శీలావతి అనే గంజాయికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఎక్కువ. కాష్టాల నాయుడు (రవింద్ర విజయ్), కందుల నాయుడు (చైతన్య రావు) అనే అన్నాదమ్ములు ఈ గాంజా సాగును అక్రమంగా నిర్వహిస్తూ, తమ దారికి అడ్డొచ్చిన వాళ్లని చంపుకొంటూ వెళ్తారు. ఈ అక్రమ వ్యాపారంలో ఘాటీలది ప్రధాన పాత్ర. వాళ్లే ప్రాణాలకు తెగించి గంజాయిని పోలీసుల కంట పడకుండా దాటించుకొంటూ వెళ్తుంటారు. బావామరదళ్లయిన దేశీరాజు (విక్రమ్ ప్రభు), శీలావతి (అనుష్క) కూడా ఘాటీలే. కానీ.. నాయుడు సోదరుల దందాకు దూరంగా బతుకుతుంటారు. అంతేకాదు.. వీళ్లే ఓ కొత్తదందాని మొదలెడతారు. అదేమిటి? కందుల నాయుడు, కాష్టాల నాయుడు కళ్లు పడ్డాక బావా మరదళ్ల పరిస్థితి ఏమైంది? అనేవి తెరపై చూడాలి.
క్రిష్ కథల్లో సహజత్వం కనిపిస్తుంది. మనవైన కథలే తెరపై పాత్రలుగా సన్నివేశాలుగా దర్శనమిస్తాయి. అయితే ఈసారి మాత్రం మనకంతగా పరిచయంలేని `ఘాటీ`ల గాథని చెప్పాలనుకొన్నాడు క్రిష్. దానికి తగినంత హౌమ్ వర్క్ కూడా చేసినట్టు అనిపిస్తుంది. ఘాటీలు, తూర్పు కనుమలు, అక్కడ దొరికే శీలావతి.. ఇలా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. లుక్ పరంగా ‘ఘాటీ’ కొత్తగా ఉంటుంది. అయితే.. ఎమోషన్ పరంగా మాత్రం రొటీన్ గానే సాగుతుంది. ఇదో రివైంజ్ డ్రామా. తనకు జరిగిన అన్యాయానికి శీలావతి ఎలా ప్రతిఘటించింది? ఎలాంటి ప్రతీకారం తీర్చుకొంది? అనేదే ఘాటీ.
ఘాటీలు, వాళ్ల జీవితాల్ని చెప్పుకొంటూ.. ఘాటీ కథని చాలా నిదానంగా ప్రారంభించాడు దర్శకుడు. బావా మరదళ్ల అసలు దందా మొదలైనప్పటి నుంచీ కథలో వేగం వస్తుంది. రైల్వే స్టేషన్ సీన్ ఆకట్టుకొంటుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ లో ఎమోషన్ రాబట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఇంట్రవెల్ వరకూ కథ చాలా స్లో ఫేజ్‌లో సాగుతుంది. కందుల నాయుడు, కాష్టాల నాయుడు క్యారెక్టర్లు, మధ్యలో జగపతిబాబు ఇన్వెస్టిగేషన్.. ఇవేం గ్రిప్పింగ్ గా అనిపించవు. పైగా జగపతిబాబుకి పెట్టిన తిండిపోతు క్యారెక్టరైజేషన్ మొదట్లో బాగానే ఉన్నా, ఆ తరవాత ఇరిటేషన్ వచ్చింది. క్యారెక్టర్ పై గానీ, అక్కడ జరుగుతున్న తంతుపై గానీ ప్రేక్షకుల ఫోకస్‌ని ఇలాంటి క్యారెక్టరైజేషన్లు బాగా దెబ్బ తీస్తుంటాయి, ఇంట్రవెల్ తరవాత శీలావతి ప్రతీకారం తీర్చుకొనే సీన్లు, అక్కడ వచ్చే ఎలివేషన్లు బాగా కుదిరాయి. అన్నట్టుగానే అనుష్కని యాక్షన్ క్వీన్ లా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ లోనూ ఓ భారీ పోరాట దృశ్యం ఉంది. యాక్షన్ సీన్లు ఎలివేట్ అయినా, ఎక్కడో ఎమోషన్ మిస్సయినట్టు అనిపించింది. క్రిష్ బలం… ఎమోషన్స్‌ని పట్టుకోవడం. ఈసారి కమర్షియల్ మీటర్ లో ఆలోచించడం వల్ల, ఎమోషన్ వైపు సరిగా దృష్టి నిలపలేకపోయారేమో అనిపిస్తుంది.
శీలావతి క్యారెక్టర్ లోనూ లోపం ఉంది. ఘాటీ పనికి శీలావతి ఎందుకు ‘నో’ చెబుతుందో, మళ్లీ ఎందుకు హీరోని ప్రేరేపిస్తుందో, మళ్లీ తానే ఎందుకు వద్దంటుందో బలమైన కారణాలు ఉండవు. దర్శకుడు క్లారిఫై ఇచ్చే ప్రయత్నం చేసినా.. అది సరిపోలేదు. కాష్టాల నాయుడు, కందుల నాయుడు దందాకి పోటీగా కొత్త దందా ఎంచుకొన్నట్టు చూపించిన తరవాత, మళ్లీ దానికి జస్టిఫికేషన్ ఇవ్వాల్సిన పనిలేదు. ‘పుష్ప’లో అల్లు అర్జున్ డబ్బుల కోసమే స్మగ్లింగ్ చేస్తాడు. తన ఆశయం అదే. దానికి జస్టిఫై చేయాలని సుకుమార్ ప్రయత్నించలేదు. ఇక్కడ కూడా ఆ అవసరం లేదు. తూర్పు కనుమల్లో దొరికే అతి అరుదైన గంజా మొక్క వెనుక కథ చెప్పాలనుకోవడం, అక్కడ ఘాటీల జీవితాన్ని ఆవిష్కరించాలనుకోవడంతో క్రిష్‌కి మంచి పాత్ దొరికింది. అయితే దాన్ని రొటీన్ గా రివైంజ్ డ్రామాగా మలచాలని చూడడంలోనే అసలు కథ, అందులో ఉన్న ఫ్రెష్ యాంగిల్ తేలిపోయింది. పైగా ఈ కథని కమర్షియల్ కోణంలో చెప్పాలా, తన స్టైల్ లో చూపించాలా అనే చోట కూడా క్రిష్ తడబడ్డాడు. కొన్ని యాక్షన్ సీన్లు, అందులో అనుష్క ఎలివేషన్లు, కొత్త లొకేషన్లు, నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు.. ఇవన్నీ ‘ఘాటీ’కి కాపుకాశాయి.
బుర్రా సాయిమాధవ్ కలం ఎందుకో ఈసారి అంత బలంగా పలకలేదు. ఆయన మార్క్ ఈ సినిమాలో కనిపించలేదు. నేపథ్య సంగీతం బాగుంది. ఎలివేషన్లకు చక్కగా ఉపయోగపడింది. ఘాటీ టైటిల్ గీతంలో సౌండింగ్ కొత్తగా అనిపించింది. ఈపాటతో కథనంలో ఊపు వచ్చింది. అనుష్కని ఇలాంటి పాత్రలో చూడడం కొత్త కాదు. తన శక్తిమేర నటించింది. విక్రమ్ ప్రభు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. తను కూడా కష్టపడ్డాడు. రవీంద్ర విజయ్ కి రొటీన్ పాత్రే కానీ, చైతన్య రావు ఆశ్చర్యపరుస్తాడు. తనని ఇలాంటి పాత్రలో చూడడం షాకే. తను కూడా ఈ అవకాశం అందిపుచ్చుకొన్నాడు. క్రిష్ కాస్టింగ్ విషయంలో ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఈసారీ అంతే.
పుష్ప లాంటి కథ ఓ హీరోయిన్ కి దొరికితే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి ‘ఘాటీ’ పుట్టుకొచ్చి ఉండొచ్చు. నిజానికి హీరోయిన్లతో ఇలాంటి కథల్ని ట్రై చేస్తే ఫ్రెష్ ఫీల్ వస్తుంది. క్రిష్ ఆ ప్రయత్నం కొంచెం గట్టిగానే చేసినా.. ఎమోషన్స్ బలంగా పండకపోవడం వల్ల సరైన ప్రతిఫలం దక్కలేదు. అనుష్క లాంటి స్టార్ ని తెరపై చూడడమే ఓ సెలబ్రేషన్. తాను కూడా వెండి తెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. ఎవరికి ఎలా ఉన్నా.. ఆమె అభిమానులు మాత్రం ఈ సినిమాపై ఓ లుక్ వేయొచ్చు.
తెలుగు రేటింగ్: 2.25/5
