క్రిష్ జాగర్లమూడి… మట్టి, మనుషులు, మానవత్వం.. ఇవన్నీ కలగలిపిన కథల్ని అందించిన దర్శకుడు. గమ్యం, వేదం, కంచె, కృష్ణం వందే జగద్గురుమ్, గౌతమి పుత్ర శాతకర్ణి… ఇలా ఎన్నో మంచి చిత్రాల్ని అందించారు. విలువలతో కూడిన వినోదానికి కేరాఫ్ గా నిలిచారు. అయితే ఈమధ్య ఆయనకు పరాజయాలే పలకరించాయి. ఎన్టీఆర్ బయోపిక్ ఓ వర్గాన్ని మాత్రమే సంతృప్తి పరిచింది. కొండపొలెం నిరాశ పరిచింది. హరి హర వీరమల్లు సినిమా నుంచి ఆయన అర్థాంతరంగా బయటకు వచ్చేశారు. ఈ సినిమా కోసం కొన్నేళ్ల పాటు శ్రమించి, చాలా త్యాగాలు చేయాల్సివచ్చింది. కానీ సరైన ఫలితం రాలేదు. ఇప్పుడు ఆయన దృష్టంతా ‘ఘాటీ’పై ఉంది.
అనుష్క ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. సెప్టెంబరు 5న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. క్రిష్ తనదైన దారిలో వెళ్తూనే, తనని తాను కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తున్నాడనిపించింది. ఘాటీల బ్యాక్ డ్రాప్, ఆ ప్రయాణం.. ఇప్పటి వరకూ ఏ దర్శకుడు, కథకుడూ సృశించలేదు. కాబట్టి.. కచ్చితంగా ఓ కొత్త కథే క్రిష్ చెప్పబోతున్నాడన్న నమ్మకం కలిగింది. ఈ సినిమాతో క్రిష్ కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమని ఇప్పటికే ‘ఘాటీ’ చూసిన వాళ్లు డంకా బనాయించి మరీ చెబుతున్నారు. అమేజాన్ ప్రైమ్ ఈ సినిమాని ఎప్పుడో మంచి రేటుకి కొనేసింది. కమర్షియల్ గా ఈ సినిమాకు ఎలాంటి బెంగ లేనట్టే. క్రిష్ మార్క్ కూడా తోడైతే.. ‘ఘాటీ’ తప్పకుండా నిలబడిపోతుంది.
ఇటీవల ‘అరేబియా కడలి’ అనే ఓ వెబ్ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి క్రిష్. ఆయన ఈ వెబ్ సిరీస్‌కి క్రియేటీవ్ హెడ్. ఈ సిరీస్‌కి మంచి అప్లాజ్ వస్తోంది. `తండేల్` కీ `అరేబియా కడలి`కీ కథ విషయంలో దగ్గరి సంబంధం ఉంది. ఎమోషన్స్ విషయంలో ‘అరేబియా కడలి’ ‘తండేల్’ని డామినేట్ చేసిందని రివ్యూలు చెబుతున్నాయి. ఓరకంగా ఇది క్రిష్ విజయం అనుకోవాలి.