సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మహేష్ బాబు వచ్చాడు. తను కూడా సూపర్ స్టార్ అయ్యాడు. రమేష్ బాబు అప్పట్లో కొన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కుమార్తె మంజుల హీరోయిన్ అవ్వాలనుకొన్నప్పుడు ఫ్యాన్స్ అభ్యంతరం చెప్పారు. దాంతో కృష్ణ ఆ ప్రయత్నం నుంచి విరమించుకొన్నారు. మంజుల నటిగా, నిర్మాతగా కొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు ఎట్టకేలకు ఘట్టమనేని కుటుంబం నుంచి ఓ హీరోయిన్ రాబోతోంది.
రమేష్ బాబుకి ఇద్దరు సంతానం. ఒక కుమారుడు, ఓ కుమార్తె. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అజయ్ భూపతి సినిమాతో డెబ్యూ చేస్తున్నాడు. ఇప్పుడు కుమార్తె వంతు వచ్చింది. రమేష్ బాబు కుమార్తె భారతి త్వరలో హీరోయిన్ గా అరంగేట్రం చేయబోతోందని తెలుస్తోంది. దర్శకుడు తేజ కుమారుడు సినిమాల్లోకి రాబోతున్నాడు. ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఇందులో హీరోయిన్ గా భారతిని ఎంచుకొన్నారని తెలుస్తోంది. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో కొంత మేర షూటింగ్ జరిగింది. ఇది ట్రైల్ షూట్ అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే.. మొత్తం షూటింగ్ అయిపోయిందని, అదంతా గోప్యంగా ఉంచుతున్నారని, రషెష్ చూసుకొన్నాక ప్రమోషన్లు మొదలెడతారని సమాచారం అందుతోంది. మొత్తానికి ఘట్టమనేని కుటుంబం నుంచి ఓ హీరోయిన్ రావడం దాదాపు ఖాయమైపోయినట్టే.
అజయ్ భూపతి – జయకృష్ణ కాంబోలో సినిమా అక్టోబరు 15 నుంచి మొదలెడతారని సమాచారం. ఇందులో ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం మోహన్ బాబు పేరు పరిశీలిస్తున్నారు.