గీతం యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ విద్యుత్ బకాయిల వివాదం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 118 కోట్ల విద్యుత్ బకాయిలు పెట్టిందని తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. రూ. 118 కోట్ల బకాయిలు చెల్లించాలని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై గీతం హైకోర్టును ఆశ్రయించింది. అయితే అందరూ విద్యుత్ బకాయిల గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక్క నెల బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తారని .. వంద కోట్లు దాటిపోయే వరకూ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ వివాదం చాలా కాలం నుంచి ఉందనే సంగతిని గుర్తించడంలేదు.
సుదీర్ఘ కాలంగా వివాదం
గీతం యూనివర్సిటీ విద్యా పరిధిలోకి వస్తుంది. సాధారణంగా విద్యాసంస్థలకు వర్తించే టారిఫ్ విధిస్తారు. కానీ విద్యుత్ శాఖ వాణిజ్య టారిఫ్ లేదా ఇతర అదనపు భారంతో కూడిన కేటగిరీలో చేర్చడం వల్లనే పెద్ద ఎత్తున కరెంట్ బిల్లు వచ్చిందని ఆ సంస్థ ఆరోపిస్తోంది. ఇలా విద్యాసంస్థలకు వర్తించే టారిఫ్ లో కాకుండా ఇతర కేటగిరిలో చేర్చడాన్ని వారు గతంలోనే సవాలు చేశారు. ఆ కేటగిరీ మార్పు సరికాదని వారి వాదన. ఆ అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఏకపక్షంగా బకాయిల లెక్కింపు
2008 నుండి బకాయిలు ఉన్నాయని TSPDCL పేర్కొనడంపై యూనివర్సిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా, ఒకేసారి భారీ మొత్తంలో పెనాల్టీలు , వడ్డీలతో కలిపి రూ. 118 కోట్లు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం ఏకపక్షమని వారు వాదిస్తున్నారు. కరెంట్ బిల్లుల లెక్కింపులో విద్యుత్ శాఖ నిబంధనలను అతిక్రమించిందని వారు చెబుతున్నారు. బిల్లులు ఎప్పటికప్పుడు కడుతున్నామని ఇప్పుడు వారు ఇచ్చిన బిల్లు అదనపు మొత్తం అని యూనివర్శిటీ వర్గాలు చెబుతున్నాయి.
నేరుగా కరెంట్ కట్ చేస్తామని హె్చచరికలు
విద్యుత్ శాఖ తగిన సమయం ఇవ్వకుండా, నేరుగా కనెక్షన్ కట్ చేస్తామని హెచ్చరించడం లేదా రికవరీ నోటీసులు జారీ చేయడంపై యూనివర్సిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం తమకు ముందస్తుగా వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించలేదని, అందుకే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని యూనివర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. TSPDCL అధికారులు తీసుకుంటున్న కఠిన చర్యల నుండి రక్షణ పొందడానికి, మరియు ఆ రూ. 118 కోట్ల డిమాండ్ నోటీసుపై స్టే ఇవ్వాలని కోరుతూ గీతం హైకోర్టులో పిటిషన్ వేసింది. వాస్తవానికి తాము ఎంత చెల్లించాలో తేల్చడానికి ఒక స్వతంత్ర కమిటీ లేదా పునఃసమీక్ష అవసరమని వారు కోరుతున్నారు.
విద్యుత్ వాడలేదు అని అనడం లేదు కానీ బిల్లింగ్ లో లోపాలు ఉన్నాయి..సరి చేయాలని యూనివర్శిటీ అంటోంది. హైకోర్టు తదుపరి విచారణలో అసలేం జరిగిందో మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కటి మాత్రం నిజం.. బిల్లులు కట్టకపోతే ఇంత కాలం విద్యుత్ సంస్థ అధికారులు కామ్ గా ఉండే అవకాశం లేదు. ఎప్పటికప్పుడు బిల్లులు కట్టించుకుంటున్నారు. ఇది కేటగిరీ మార్పు వల్ల విధించిన అదనపు మొత్తం అనుకోవచ్చు.
