విశాఖలో గూగుల్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతోందన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. గతంలో ఎంవోయూ కూడా చేసుకున్నారు. అయితే ఏ విభాగంలో పెట్టుబడులు పెడతారన్నదానిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. అమెరికా తర్వాత అతి పెద్ద డేటా సెంటర్ ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని గూగుల్ నిర్ణయించుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ప్రకటించింది.
గూగుల్ విశాఖపట్నంలో 1 గిగావాట్ డేటా సెంటర్‌ను నిర్మించడానికి 6 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అంటే మన రూపాయల్లో 50 వేల కోట్లు. ఈ పెట్టుబడిలో 2 బిలియన్లు రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ కోసం కేటాయిస్తారు. ఇది డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్ అందిస్తుంది. ఈ డేటా సెంటర్ ఆసియాలో అతిపెద్దదిగా ఉంటుందని, సింగపూర్, మలేషియా, థాయిలాండ్‌లలో గూగుల్ డేటా సెంటర్ విస్తరణలో భాగంగా ఉంటుందని రాయిటర్స్ చెబుతోంది.
ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌ను ఒక టెక్ హబ్‌గా మార్చడంలో భాగంగా, విశాఖపట్నంలో మూడు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నారా లోకేష్ ప్రకటించారు. విశాఖ అంతర్జాతీయ దిగ్గజం టెక్ కంపెనీలకు డెస్టినేషన్ గా మారుతోంది. గతంలోనే ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో మొత్తం తలకిందులు అయింది.