ఉచిత వ్యాక్సిన్ పథకానికి విరాళాల సేకరణ బాధ్యతలను మంత్రి గౌతం రెడ్డికి.. ముఖ్యమంత్రి జగన్ అప్పగించినట్లుగా ఉన్నారు. ఆయన ప్రత్యేకంగా టాస్క్ తీసుకుని మరీ.. పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు. వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి గౌతమ్‌రెడ్డి అయి.. కొవిడ్ నియంత్రణకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో పనులు ఉన్నవాళ్లు గిట్టుబాటు అవుతుందనుకుంటే.. రేపోమాపో సీఎంఆర్ఎఫ్కు విరాళాలు సమర్పించుకునే అవకాశం ఉంది.
అయితే గౌతం రెడ్డి కూడా పారిశ్రామికవేత్తే.. వాళ్ల నాన్న ప్రారంభించిన కేఎంసీ అనే కంపెనీకి వేల కోట్లలోనే టర్నోవర్ ఉంది. మరి ఆయన ఏమీ ఇవ్వరా.. అని సహచర కాంట్రాక్టర్లు.. పారిశ్రామిక వేత్తలకు అనుమానం వస్తుందని అనుకున్నారేమో.. కానీ.. తమ కంపెనీ నుంచి కోటిన్నర సీఎంఆర్ఎఫ్కు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. గతంలో లాక్ డౌన్ విధించిన సమయంలో ప్రభుత్వానికి అండగా ఉండాలంటూ… ఇచ్చిన పిలుపునకు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కోట్లకు కోట్లు సీఎంఆర్ఎఫ్కు సమర్పించుకున్నారు. ఈ సారి కూడా అదే వేవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో కానీ.. పెద్దగా స్పందన రావడం లేదు.
ఉద్యోగులు కూడా.. తమ ఒక్క రోజు జీతాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడటం లేదు. అదే సమయంలో.. ప్రజాప్రతినిధులు కూడాపెద్ద ఎత్తున సేకరించలేకపోతున్నారు. ఎంత వైసీపీ సానుభూతి పరులైన పారిశ్రామికవేత్తలైనా.. అలా ప్రతీ సారి విరాళాలివ్వడం సాధ్యం కాదన్న భావన ఉంది.అందుకే.. పరిశ్రమల మంత్రికి జగన్ బాధ్యతలిచ్చారు. పరిశ్రమల వర్గాల నుంచి ఎంత మేర సీఎంఆర్ఎఫ్ నిధుల్ని గౌతం రెడ్డి తెస్తారో ముందు ముందు చూడాల్సి ఉంది.