6 నెలలు కాకుండానే అధికార అసహనం..! దేనికి సంకేతం..?

హామీలపై ప్రశ్నిస్తే ఎదురుదాడి..! వైఫల్యాలపై విమర్శిస్తే పచ్చి బూతులు..! మత పరమైన అరాచకాలపై మాట్లాడితే ఎగబడికొట్టేంత ఆవేశం..! ఇలా చెప్పుకుంటూ.. పోతే.. ఆంధ్రప్రదేశ్ సర్కార్‌లో భాగమైన వాళ్ల అసహనం.. కట్టలు తెంచుకుంటోంది. అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీడియా ముందు.. ” నీ అమ్మ..మొగుడా..” లాంటి పదాలను వాడేస్తున్నారు. అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. ఎవరూ మాట్లాడకూడదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఏపీ సర్కార్ పాలన మొదలు పెట్టి.. ఆరు నెలలు కూడా కాలేదు. కానీ.. పాలకుల్లో ఎందుకింత అసహనం వచ్చింది..? తెర వెనుక ఏమైనా జరుగుతోందా..?

హామీలు నెరవేర్చలేక ఎదురుదాడి వ్యూహమా..?

ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు.. ఆరు లంఖణాలు వేసినట్లుగా మారింది. జగన్ పెంచేసిన అంచనాలకు.. పాలనలో చూపిస్తున్న ప్రావీణ్యానికి హస్తిమశకాంతరం ఉంది. ఇప్పటి వరకూ అమలు చేసిన ఒకే ఒక్క నవరత్నం… రైతు భరోసా. దాన్ని కూడా.. చెప్పినట్లుగా 12500 కాకుండా.. రూ. 7500 చేసి.. దీన్ని కూడా మూడు భాగాలుగా ఇస్తున్నారు. వీటిని ఇవ్వడానికి కూడా.. లక్షల మంది రైతుల్ని… ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. దీంతో.. సహజంగానే ప్రజల్లో అసహనం కనిపిస్తోంది. ఆరు నెలల పనితీరులో ఏ ఒక్క వర్గం కూడా ప్రభుత్వంపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసే పరిస్ధితి లేదు. ఉపాధి కోల్పోయిన వారు.. ఇప్పుడల్లా కోలుకునే స్థితి లేదు. వారి ఆగ్రహం తట్టుకోలేక మంత్రులు రోడ్ల మీద వెళ్లడం మానేశారు.

బండబూతులు తిడితే.. అందరూ నోరు మూసేస్తారా..?

సన్నబియ్యం ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. అది నవరత్నాల్లో లేదు. కానీ ముందూ వెనుకా ఆలోచించకుండా చేసే ముఖ్యమంత్రి ప్రకటనలో ఇదీ ఒక భాగం. ఆతర్వతా సన్న బియ్యం ఇస్తామని బోలెడన్ని సార్లు సంబంధింత మంత్రి కొడాలి నాని చెప్పారు. సాక్షి పత్రికలో వచ్చింది. కేబినెట్‌లోనూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తీరా ఇవ్వలేమని తెలిసి.. ” నీ అమ్మ మొగుడు చెప్పాడా..? ” అంటూ.. కొడాలి నాని.. అసభ్యకరంగా ఎదురుదాడి చేస్తున్నారు. చెప్పింది ఆయనే అనేదానికి వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అయినా ఎదురుదాడి.. తమను ప్రశ్నిస్తున్నారనే అసహనమే కారణంగా కనిపిస్తోంది.

సర్కార్‌లో కట్టలు తెంచుకుంటున్న అసహనం వెనుక మరో కోణం కూడా ఉందా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల అసహనం వెనుక.. బయటకు తెలియని కొన్ని కీలక పరిణామాలు కూడా ఉన్నాయంటున్నారు. ఏపీలో ఢిల్లీ వ్యవహారాలపై.. పూర్తి స్థాయిలో .. ఓ విభాగం పరిశీలన జరిపిందని.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా.. మొత్తం నడుస్తోందని తేల్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు కట్టడి చేయకపోతే.. దేశంపైనే ఆ ప్రభావం పడుతుందన్న అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకే.. ఉన్నపళంగా.. రాబోయే రోజుల్లో కొన్ని కీలకమైన చర్యలు ఉండబోతున్నాయని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై.. వైసీపీ నేతల స్పందన.. ఆ కోణంలోనిదేనంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాతనే… ఏమీ చేయలేక.. వైసీపీ నేతలు తిట్లు లంకించుకుంటున్నారని అంటున్నారు. ఈ అసహనానికి కారణం ఏమిటో.. మరో నెల రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com