ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంలో గత పాలకులకు విధేయులుగా ఉంటూ, ప్రస్తుత ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తున్న వారిపై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో ధనుంజయ్ రెడ్డి వంటి కీలక వ్యక్తుల కదలికలు, అధికారులతో వారి రహస్య భేటీలు చేస్తున్న వారిని శంకరగిరి మాన్యాలకు పంపుతోంది. గత ప్రభుత్వ హయాంలో సీఎంవోలో అత్యంత శక్తివంతమైన అధికారిగా వెలుగొందిన ధనుంజయ్ రెడ్డి, ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారులను ఉసిగొల్పుతున్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి.
జైలుకు వెళ్లి వచ్చినా మారని ధనుంజయ్ రెడ్డి
లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా ధనుంజయ్ రెడ్డి తన పాత పరిచయాలను వాడుకుని ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని సేకరించడం , అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం వంటి కుట్రలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. హైదరాబాద్, తాడేపల్లి వేదికలుగా జరుగుతున్న ఈ రహస్య సమావేశాలు పాలనా వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా నీలకంఠారెడ్డి అని ప్రమోటెడ్ ఐఏఎస్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన అక్రమ పద్ధతుల్లో ఐఏఎస్ హోదా పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు పొంది, ఇప్పటికీ పాత యజమానుల కోసం పని చేస్తున్న అధికారుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇది యంత్రాంగంలో ఉన్న కోవర్టుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
నిఘా నీడలో అధికారులు
ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉంటూనే ప్రతిపక్ష నేతలతో టచ్‌లో ఉన్న అధికారులపై ప్రభుత్వం ప్రత్యేకంగా నిఘా పెట్టింది. ముఖ్యంగా ధనుంజయ్ రెడ్డితో భేటీ అయిన వారి కాల్ డేటా, పర్యటనల వవరాలను ఐబీ సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ విధానాలను నీరుగార్చడం లేదా రహస్య జీవోల సమాచారాన్ని బయటకు పొక్కేలా చేయడం వంటి చర్యలను రాజ్యద్రోహం గా పరిగణించి, కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలి పెట్టేదిలేదని సంకేతాలు ఇస్తున్నారు.
వ్యవస్థ ప్రక్షాళన దిశగా..
రాజకీయ నాయకుల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టించే అధికారుల పట్ల ఉదాసీనత వహించకూడదని ప్రభుత్వం గట్టి నిర్ణయానికి వచ్చింది. వైసీపీ పెద్దలను నమ్ముకుని తప్పులు చేసిన వారు ఇప్పటికే జైలు పాలవుతున్నా, ఇంకా కొందరు అధికారులు మారకపోవడంపై సీరియస్ అయింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై కుట్రలు చేయడం అంటే ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడమే. అందుకే, ఇలాంటి విభీషణుల ఆట కట్టించి, పాలనను పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోబోతోంది.


