అమరావతికి రెండో దశ భూసమీకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముందుగా ప్రచారం జరిగినట్లుగా వేల ఎకరాలు కాకుండా .. కొంత మేర ఇతర అవసరాలకు నాలుగైదు గ్రామాల్లో భూసమీకరణ చేయాలని అనుకుంటోంది. ఇందు కోసం రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రభుత్వానికి రైతుల నుంచి ఒక సూచన బలంగా వస్తోంది. రాజధాని కోసం భూములు ఖచ్చితంగా ఇస్తాం.. అందులో మరో సందేహం లేదు.కానీ ఇప్పటికే సేకరించిన భూముల్లో ప్రకటించినట్లుగా అభివృద్ధి చేయండి.. ఆ తర్వాత ఇస్తాం అని చెబుతున్నారు. రైతుల వాదన సముచితంగా ఉంది. ప్రభుత్వం ముందు తాను చెప్పిన పనుల్ని చేసి చూపించాలి.
ముందుగా భూములిచ్చిన రైతులకు చెప్పిన ప్రయోజనాలు వచ్చేలా చేయాలి !
రాజధాని రైతులు సర్వం కోల్పోయారు. రాజధాని కోసం భూములు ఇచ్చారు. రాజధానితో పాటు తాము కూడా ఎదుగుదామని అనుకున్నారు కానీ.. రాజకీయ నాయకుల కుట్రల వల్ల ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుందని అనుకోలేదు. భూములు ఇచ్చేశారు కాబట్టి ఇక వారు రైతులు కాదని.. రియల్ ఎస్టేట్ వ్యాపారులని కూడా నిందించారు. ఇలాంటి అవమానాలు అమరావతి రైతులు పడ్డారు. ఇప్పుడు వారికి ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం నెరవేర్చాలి. అభివృద్ధిని అదే స్థాయిలో చూపించి భూములు ఇచ్చినందుకు , వారు పడిన కష్టాలకు తగిన ప్రతిఫలం వస్తుందని భరోసా ఇవ్వగలగాలి. ప్రస్తుతం ప్రభుత్వంపై ఇదే బాధ్యత ఉంది.
రెండేళ్ల వరకూ పూర్తిగా అభివృద్ధిపైనే దృష్టిపెట్టాలి !
అమరావతి పనుల్ని ప్రధాని మంత్రి నరేంద్రమోదీ రీ స్టార్ట్ చేశారు. అమరావతి విషయంలో ప్రభుత్వానికి ఎన్నో హై రేంజ్ ఆలోచనలు ఉన్నాయి. వాటిని అమలు చేయాలంటే నమ్మకం అనే పునాదుల్ని మొదటి నుంచి బలోపేతం చేసుకోవాలి. ఇది అమరావతి.. అజరామరం అనే అభిప్రాయానికి వచ్చేలా చేయగలగాలి. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనను ఇప్పుడల్లా ఎవరూ మర్చిపోరు. అలాంటి పరిస్థితి మళ్లీ వస్తుందని తల్చుకుంటేనే ఎవరైనా గగుర్పాటుకు గురవుతారు. రాదని వచ్చినా ఆ రాక్షసులు కూల్చలేనంత గట్టిగా అమరావతి ఉంటుందన్న నమ్మకాన్ని భరోసాని కల్పించాలి. అలా చేయాలంటే నిర్మాణ పనులు శరవేగంగా జరగాలి.
రైతులకు నమ్మకం కలిగితే భూసమీకరణ అసలు సమస్యే కాదు !
ప్రస్తుతం అమరావతిలో అన్ని పనులకు కాంట్రక్టులు ఇచ్చారు. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభిస్తున్నారు. మరో ఏడాది పాటు ఎంత వేగంగా నిర్మాణ పనులు చేస్తే.. రైతుల్లో అంతగా నమ్మకం బలపడుతుంది. ఒక్క ప్రభుత్వమే అన్నీ చేయలేదు కాబట్టి.. అత్యధికంగా ప్రైవేటు సంస్థల్ని కూడా ఆహ్వానించాల్సి ఉంది. వాటికి భూములు కేటాయించడం కాదు.. వచ్చే ఒకటి, రెండేళ్లలో భవనాలు పూర్తి చేసి కార్యకలాపాలు నిర్వహించేలా చేయాలి. అప్పుడే నమ్మకం బలపడుతుంది. అలా చేసిన తర్వాత రైతులు భూములు ఇవ్వడానికి ఎలాంటి సందేహాలు పెట్టుకోరు. అలా అభివృద్ది చేస్తే మరో 30వేల ఎకరాలు ఇవ్వమన్నా ఇస్తారు. ప్రభుత్వం ఇప్పుడు విస్తరణపై దృష్టి మాని.. సమీకరించిన భూమలు రైతుల్లో నమ్మకం పెంచాలి.