అమరావతికి రెండో విడత భూసమీకరణపై ప్రభుత్వం ఇప్పటికి వెనక్కి తగ్గినట్లుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం అమరావతి పనులు జోరుగా సాగుతున్నా.. ఇంకా ప్రజల్లో నమ్మకం బలపడలేదు. పూర్తి స్థాయిలో అభివృద్ధి కనిపించిన తర్వాత.. చూపించిన తర్వాతే రెండో విడత భూసమీకరణ సక్సెస్ అవుతుంది. ఈ లోపే మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు వారికి చెప్పిన హామీలు నెరవేర్చి.. ఇవ్వాల్సిన భూముల్ని అభివృద్ధి చేసి ఇస్తే ఇక తిరుగు ఉండదు. ఇదే అభిప్రాయం ప్రజల్లోనూ కనిపించడంతో.. ప్రభుత్వం రెండో విడత భూసమీకరణ విషయంలో స్లో అయినట్లుగా కనిపిస్తోంది.
అమరావతి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. మంత్రి వర్గ ఉపసంఘంలో రెండో విడత భూసమీకరణపై చర్చిస్తామన్నారు. నిజానికి చాలా వరకూ గ్రామసభలు పెట్టి.. భూములు ఇస్తామన్న వారి దగ్గర అనుమతి పత్రాలు తీసుకుంటున్నారు. కానీ కొన్ని చోట్ల వైసీపీ నేతలు భూములు ఇవ్వకూడదనుకున్న వారిని సమీకరించి రచ్చ చేశారు. ఏ పార్టీ వాళ్లు అయినా భూములు ఇవ్వబోము అన్న పరిస్థితి వస్తే.. ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాల్సిందే. మొదటి దశలో రైతులకు మేలు జరిగి లాభపడినట్లయితే.. ఇవ్వబోము అనే వాళ్లు ఉండరు.
ఈ విషయంలో ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకుంది. అందుకే స్లో చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతానికి అమరావతికి నిధుల కొరత లేదు. రెండు, మూడేళ్లలో ప్రస్తుతం ప్రభుత్వం తరపున ప్రారంభించిన నిర్మాణాలన్నీ పూర్తి చేసి.. ప్రైవేటుగా భూములు కేటాయించిన వారు కూడా కార్యకలాపాలు ప్రారంభించేలా చేస్తే.. రెండో విడత చాలా సింపుల్ గా పూర్తయిపోతుంది. ఈ విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. రెండో విడత భూసమీకరణ విషయంలో.. ప్రజాభిప్రాయానికి తగ్గట్లే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.