రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం గ్రీన్ బిల్డింగ్ అనేది ఒక పెద్ద మార్కెటింగ్ మంత్రంగా మారింది. అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టుల బ్రోచర్లపై IGBC , LEED రేటింగ్స్ ఉన్నాయని బిల్డర్లు గొప్పగా ప్రకటిస్తున్నారు. అయితే, చాలా సందర్భాల్లో ఇది కేవలం విజువల్ బ్రాండింగ్‌కే పరిమితమవుతోంది. ఇంటి చుట్టూ మొక్కలు పెంచడం లేదా పచ్చని రంగు వేయడం మాత్రమే గ్రీన్ బిల్డింగ్ కాదు. నిజమైన గ్రీన్ హోమ్ అంటే సహజ వనరులను పునరుద్ధరిస్తూ, నివాసితులపై నెలవారీ మెయింటెనెన్స్ భారాన్ని గణనీయంగా తగ్గించే ఒక పటిష్టమైన సాంకేతిక వ్యవస్థ. ఇక్కడ కొనుగోలుదారులు బ్రాండింగ్ వెనుక ఉన్న వాస్తవాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా అపార్ట్మెంట్లలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్థ్యం అత్యంత కీలకం. చాలా ప్రాజెక్టుల్లో కేవలం అనుమతుల కోసం నామమాత్రపు ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా, వినియోగించిన నీరు సరిగ్గా శుద్ధి కాక, చెడు వాసన రావడం లేదా ఆ నీటిని ఫ్లషింగ్‌కు, గార్డెనింగ్‌కు వాడుకోలేక పోవడం జరుగుతోంది. సరైన ఎస్టీపీ లేకపోతే, వేసవిలో నీటి ఎద్దడి తలెత్తినప్పుడు భారీ ఖర్చుతో బయట నుండి ట్యాంకర్లను తెప్పించుకోవాల్సి వస్తుంది. ఒక వేళ ప్లాంట్ సమర్థవంతంగా ఉంటే, మీ నీటి వినియోగంలో దాదాపు 30 నుండి 40 శాతం ఆదా అవుతుంది, ఇది నేరుగా మీ జేబుపై భారాన్ని తగ్గిస్తుంది.
మరో ప్రధాన అంశం సోలార్ గ్రిడ్ , విద్యుత్ వినియోగం. గ్రీన్ బిల్డింగ్ అని చెప్పుకునే ప్రాజెక్టులలో కామన్ ఏరియా లైటింగ్, లిఫ్టులు, వాటర్ పంపుల కోసం సోలార్ పవర్ గ్రిడ్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. కేవలం సోలార్ వాటర్ హీటర్లు ఉంటే అది గ్రీన్ బిల్డింగ్ అవ్వదు. గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ సిస్టమ్ ఉంటేనే అపార్ట్మెంట్ అసోసియేషన్ చెల్లించే కరెంటు బిల్లులు తగ్గుతాయి, తద్వారా ఫ్లాట్ యజమానులపై పడే మెయింటెనెన్స్ ఖర్చు తగ్గుతుంది.
రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తలు కేవలం ఫోటోల కోసం కాకుండా, భూగర్భ జలాలను నిజంగా రీఛార్జ్ చేసే విధంగా శాస్త్రీయంగా నిర్మించారో లేదో ప్లాన్లలో చూడాలి. కొనుగోలుదారులు బిల్డర్ ఇచ్చే సర్టిఫికెట్లను మాత్రమే కాకుండా, ఆ ప్రాజెక్టులో వాడిన మెటీరియల్ , డబుల్ గ్లేజ్డ్ విండోస్ వంటి వాటి గురించి ఆరా తీయాలి. ఇవి ఇంట్లోకి వచ్చే వేడిని తగ్గించి ఏసీ వాడకాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ హోమ్ అనేది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, సగటున ఒక కుటుంబానికి నెలవారీ ఖర్చుల్లో 20 నుండి 30 శాతం వరకు పొదుపు చేయగలగాలి. లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టుకుని ..దానికి తగ్గ ప్రయోజనాలను పొందలేకపోయినట్లే.

