రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు, రుణాల మంజూరు ప్రక్రియలో రానున్న రోజుల్లో పెను మార్పులు సంభవించనున్నాయి. పర్యావరణ హితమైన నిర్మాణాలకు మాత్రమే బ్యాంకులు ప్రాధాన్యతనిస్తూ, సులభంగా రుణాలు ఇచ్చేలా కొత్త నిబంధనలు రాబోతున్నాయన్న వార్త ఇప్పుడు బిల్డర్లలో హాట్ టాపిక్‌గా మారింది.
అంతర్జాతీయంగా పెరుగుతున్న పర్యావరణ స్పృహ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం గ్రీన్ ఫైనాన్సింగ్ వైపు మొగ్గు చూపుతోంది. దీని ప్రకారం, పర్యావరణానికి హాని కలిగించని ప్రాజెక్టులకే తక్కువ వడ్డీ రేట్లు, వేగవంతమైన లోన్ ప్రాసెసింగ్ వంటి వెసులుబాట్లు కల్పించే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, బిల్డర్లు తమ ప్రాజెక్టులలో సోలార్ ఎనర్జీ ప్యానెల్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ , సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ , సహజసిద్ధమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా, నిర్మాణంలో వాడే మెటీరియల్ కూడా పర్యావరణానికి అనుకూలమైనదై ఉండాలి. ఒకవేళ బిల్డర్ ఈ ప్రమాణాలను పాటించకపోతే, బ్యాంకులు ఆ ప్రాజెక్టుకు ఇచ్చే రుణ పరిమితిని తగ్గించడం లేదా వడ్డీ రేట్లను పెంచడం వంటి చర్యలు తీసుకుంటాయని తెలుస్తోంది. ఇది చిన్న , మధ్యతరగతి బిల్డర్లకు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది, ఎందుకంటే గ్రీన్ బిల్డింగ్ నిర్మాణ వ్యయం సాధారణం కంటే 10-15% అధికంగా ఉంటుంది.
ఈ నిబంధనల వల్ల దీర్ఘకాలంలో కొనుగోలుదారులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ ఉన్న అపార్ట్మెంట్లలో నివసించే వారికి విద్యుత్ , నీటి బిల్లులు 20% నుండి 30% వరకు తగ్గుతాయి. బ్యాంకులు కూడా ఇటువంటి ప్రాజెక్టులలో ఫ్లాట్లు కొనే వినియోగదారులకు ‘గ్రీన్ హోమ్ లోన్ పేరిట తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. పర్యావరణ హితమైన ఇల్లు కొనడం వల్ల అటు ప్రకృతికి, ఇటు జేబుకు కూడా లాభమేనన్న ప్రచారం పెరగడంతో.. బిల్డర్లు కూడా తమ పాత పద్ధతులను మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు.
