2015లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 2ని హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆ నోటిఫికేషన్ లో ఉద్యోగాలు సంపాదించి.. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి పరిస్థితి రిస్క్ లో పడిపోయింది. వారు ఉద్యోగాలు ఇప్పటికైతే పోయినట్లే. ఇదొక్కటే కాదు.. ఇటీవలి కాలంలో పాత నోటిఫికేషన్లు చాలా రద్దు చేస్తూ కోర్టులు ఉత్తర్వులు ఇస్తున్నాయి. ఏపీలో గ్రూప్ వన్ ను రద్దు చేశారు. ఆ నోటిఫికేషన్ లో ఎన్నికయినా వారంతా ఇప్పుడు సీనియర్ ఆఫీసర్లుగా ఉన్నారు. వారి పరిస్థితి గాల్లో దీపంలా మారింది. ఇంతకూ తప్పెవరిది.. ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు?
పారదర్శకత లేకుండా పరీక్షల నిర్వహణ
ఉద్యోగపరీక్షల నిర్వహణ, నియామకాలు పారదర్శకత లేకుండా నిర్వహించడం వల్లనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. నోటిఫికేషన్ లో ఇచ్చిన రూల్స్ ప్రకారం పక్కాగా పరీక్షలు నిర్వహించాల్సిన ఉంది. నిర్వహణలో అనేక టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. అవే కారణాలతో పరీక్షలు పూర్తయిన తర్వాత .. నియామకాలు జరిగిన తర్వాత కూడా కోర్టుల్లో కేసులు పెడుతున్నాయి. కోర్టులు కూడా ఆ టెక్నికల్ కారణాలతో నియామకాలను రద్దు చేస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగం పొందిన వారు కూడా రోడ్డున పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉద్యోగం సాధించినా ప్రశాంతంగా ఉండలేని జీవితం
గ్రూప్స్ ఉద్యోగం సాధించడానికి యువత ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతూంటారు. అలా శ్రమ చేసి వచ్చిన ఉద్యోగం తప్పుడుదని.. కొనుక్కున్నారని.. అక్రమం అని రద్దు చేస్తే వారికి ఎలా ఉంటుంది ?. నిజంగా నియామకాల్లో తప్పు జరిగిందో లేదో ఎవరికీ తెలియదు. కానీ శిక్ష మాత్రం అనుభవించాల్సి వస్తోంది. ఇటీవల గ్రూప్ వన్ నియామకాల్లోనూ ఇదే పరిస్థితి. కోర్టు అనుమతితో ఫలితాలు ప్రకటించి.. నియామక పత్రాలిచ్చారు. ఎంతో మంది స్ఫూర్తి కథలు బయటకు వచ్చాయి.కానీ వారి ఉద్యోగాలు కోర్టు తీర్పునకు లోబడే ఉంటాయి.ఓ పదేళ్ల తర్వాత అయినా వ్యతిరేకంగా తీర్పు వస్తే ఉద్యోగాలు పోతాయి.
యువత సమయం వృధా చేసుకోవడం దండగ
ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత సమయం వృధా చేసుకోవడం దండగ. ప్రస్తుతం ప్రైవేటు రంగంలో .. ఎంతో మంచి జీతభత్యాలు లభిస్తున్నాయి. లగ్జరీ లైఫ్ వస్తోంది. సివిల్స్ పాస్ అయిన వాళ్లు కూడా సర్వీస్ వదిలేసి.. ప్రైవేటు ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రైవేటు కంపెనీలకు తగ్గట్లుగా స్కిల్స్ పెంచుకుని ఆ దిశగా పోటీ పడితే.. జీవితంలోఎంతో ఎత్తుకు ఎదగవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సమయాన్ని వృధా చేసుకుని..దాన్ని సాధించిన తర్వాత కూడా అది ఉంటుందో.. ఊడుతుందో తెలియని పరిస్థితుల్లోకి వెళ్లడం.. విషాదమే. యువత ఈ అంశంపై ఆలోచించుకోవాల్సి ఉంది.

