ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అసలు ఆట ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. ఇప్పటివరకు నిందితులు తోచింది చెప్పేశారు.. పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. కొన్నింటికి తెలివైన సమాధానాలు ఇచ్చామని సంబురపడిపోయారు. కానీ, అసలు కథ ఇప్పుడు మొదలు కాబోతోంది.
లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి , బాలాజీ గోవిందప్పలను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు విచారిస్తున్నారు.ఇప్పటివరకు ఈ విచారణలో విలువైన సమాచారాన్ని సేకరించగా.. కొన్ని అంశాలపై ఈ నలుగురూ పొంతన కుదరని విధంగా సమాధానం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అసలు వాస్తవాలను ముందుంచి నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టే దిశగా సిట్ సమాయత్తం అవుతోంది.
రాజ్ కేసిరెడ్డి , బాలాజీ గోవిందప్ప , ధనుంజయ రెడ్డి , కృష్ణమోహన్ రెడ్డిలను కలిపి విచారించాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు నుంచి అనుమతి రాగానే ఈ నలుగురిని కలిపి విచారించి కీలక విషయాలను రాబట్టే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటి వరకు ఈ కేసులో కొన్ని అంశాలపై నెలకొన్న పీటముడి గ్రూప్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెగనుందని తెలుస్తోంది.ఆ తర్వాత కేసు కింగ్ పిన్ వైపు వెళ్లేందుకు ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. దీంతో ఈ కేసులో గ్రూప్ ఇన్వెస్టిగేషన్ ను కీలక మలుపుగా చెప్పొచ్చు.