జీఎస్టీ సంస్కరణలను కేంద్రం అమల్లోకి తెచ్చింది. ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించి ప్రజలకు గొప్ప పండుగ కానుక ఇస్తున్నామని ప్రకటించారు. అటు రాష్ట్రాల్లోనూ అన్ని ప్రభుత్వాలు హడావుడి చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కానీ ఇతర రాష్ట్రాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. జీఎస్టీ సంస్కరణలపై విస్తృత ప్రచారం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అసెంబ్లీలో షెడ్యూల్ కూడా ప్రకటించారు. కానీ ఇలాంటి ప్రచారాల వల్ల అతి చేస్తున్నారన్న అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. ఆ తగ్గింపుల ప్రయోజనాలు ప్రజలకు అందితే అసలు ప్రచారం అవసరమే ఉండదు.
జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ప్రయోజనం
జీఎస్టీ విషయంలో కేంద్రం తీసుకున్న సంస్కరణలు నిజంగానే ప్రజలకు ప్రయోజనం. చాలా వరకూ నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువుల ధరలు తగ్గుతున్నాయి. అలా కార్ల వంటి కలలు నెరవేర్చుకునేందుకు అవసరమైన తగ్గింపులు లభించాయి. మధ్యతరగతి ప్రజలు తమ ఇంటి కోసం కొనుగోలు చేయాలనుకుంటున్నా కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు.. లేదా ఫర్నచర్ వంటి ధరలు తగ్గుతాయి. ఎంతో కొంత ధైర్యం చేసి ఈ పండుగకు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న కోరికల్ని తీర్చుకుంటారు. అలాగే రోజువారీ ఖర్చులు తగ్గుతాయి.
ఆ ప్రయోజనం వారు ఫీలవ్వాలి కానీ చెప్పాల్సిన పరిస్థితి రాకూడదు !
ప్రజలు తము జీఎస్టీ సంస్కరణల వల్ల లాభపడుతున్నామని సొంతంగా అనుకోవాలి. అలా వారికి అనిపించాలి. అప్పుడు మాత్రమే దాని వల్ల రాజకీయ ప్రయోజనం కూడా లభిస్తోంది. అంతే కానీ వారి చెవిలో జోరీగలాగా.. ప్రతి దానికి జీఎస్టీ తగ్గించాము.. జీఎస్టీని తగ్గించాము అని ప్రచారం చేయడం వల్ల ప్రజలకు విసుగు వస్తుంది తప్ప.. ప్రభుత్వం ఏదో చేసిందన్న అభిమానం ఏర్పడదు. నిజానికి ప్రతి ప్రభుత్వ పథకంలోనూ ఇలాగే ఉంటుంది. ప్రజలు నిజంగా లాభపడ్డాము అని ఫీల్ కావాలి కానీ ప్రచారాల వల్ల ప్రయోజనం ఏముంటుంది.. అతిగా చెప్పుకుంటున్నారన్న అసహనం మాత్రం వస్తుంది.
అతి ప్రచారం ఎప్పటికీ మైనస్సే !
ఇప్పుడు ప్రచారం స్టైల్ కూడా మారిపోయింది. నేరుగా చెబితే అతిశయోక్తి అని ప్రజలు అనుకుంటారు. అంతా పరోక్ష ప్రచారమే ఇప్పుడు కీలకం. అంటే.. ప్రభుత్వ పథకాల వల్ల పొందిన మేలును వారికి తెలియచేసేలా చేయడం. జీఎస్టీని నిర్ణయం వల్ల మీకు ఇంత మిగిలింది అని వారు ఫీలయ్యేలా చేయగలిగేలా చేయడమే అసలైన ప్రచార విజయం. నేరుగా .. తగ్గింపులపై ప్రచారాలు చేసుకుంటే .. పెద్దగా ప్రయోజనం ఉండదు.