ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిరాయింపుల్ని ఎడాపెడా ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రాలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో వైకాపా నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించారు. వారితో రాజీనామాలు చేయించి ఉంటే కొంత పరువు దక్కేది! కానీ, రాజీనామాల ఊసెత్తకుండా ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నారు. ఇన్నాళ్లూ ఎమ్మెల్యేల స్థాయిలో ఉండే ఈ ఫిరాయింపుల్ని క్షేత్రస్థాయికి కూడా విస్తరించాలని అనుకుంటున్నారో ఏమో… మున్సిపాలిటీ స్థాయి పార్టీ ఫిరాయింపుల్ని కూడా ముఖ్యమంత్రి దగ్గరుండి ప్రోత్సహించడం విశేషం. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ ఛైర్మన్ వై. శ్రీనివాసరావుతోపాటు మరో తొమ్మిది మంది వైకాపా కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, వర్ల రామవయ్య వంటి తదితర ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఈ ఫిరాయింపుల పుణ్యమా అని గుడివాడ మున్సిపాలిటీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కైవసం అవుతుంది. అయితే, ఈ ఫిరాయింపుల్ని నివారించేందుకు వైకాపా నాయకుడు కొడాలి నాని చాలా ప్రయత్నాలు చేశారట! అయినా, నివారించలేకపోయారు. ఇన్నాళ్లూ వైకాపా ఎమ్మెల్యేలను దేశంలోకి ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కండువా కప్పేవారు. ఇప్పుడు కౌన్సిలర్లను కూడా ముఖ్యమంత్రే ఆహ్వానిస్తుండటం గమనార్హం. ఫిరాయింపుల స్థాయిని పెంచారో.. రాజకీయాల స్థాయిని దిగజార్చుతున్నారో అర్థం కాని పరిస్థితి.
ఒక పార్టీ టిక్కెట్‌పై గెలిచి… మరో పార్టీలోకి ఫిరాయించేముందు రాజీనామా చేయడం కనీస ధర్మం. రాజీనామా చేశాక ఎంతమంది ఎన్నిపార్టీలు మారినా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ, రాజీనామా ఊసే ఎత్తకుండా పార్టీలు మారిపోతూ… పదవులు అనుభవిస్తూ ఉంటే ప్రజాతీర్పును వెక్కిరించినట్టే! నేటి రాజకీయాల్లోని ఈ దుష్ట సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబే దగ్గరుండి పెంచి పోషిస్తుంటే ఏమనుకోవాలి..? ఎమ్మెల్యేల నుంచి కౌన్సిలర్లకు స్థాయికి ఫిరాయింపులు చేరాయి. రేప్పొద్దున గ్రామస్థాయికి కూడా చంద్రబాబే తీసుకెళ్తారేమో! సర్పంచ్‌లూ వార్డు మెంబర్లు కూడా పార్టీ మారాతామంటే ఆయనే స్వయంగా కండువా కప్పి ఆహ్వానిస్తారేమో..! ఓ పక్క ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ.. ఇంకోపక్క నీతులు చెబుతూ ఉంటే విన్నవారికి విచిత్రంగానూ విడ్డూరంగా ఉంటుంది.