గుజరాత్ ఎన్నికల ఫలితాలను రాష్ట్రానికో విధంగా అన్వయించే పనిలో పడ్డారు ఆయా రాష్ట్రాల భాజపా నేతలు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశంలోని 19 రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉన్నట్టే లెక్క. ఇక, ఆ పార్టీ తదుపరి లక్ష్యం.. కర్ణాటక. అయితే, అక్కడ సిద్ధ రామయ్య సర్కారు చాలా బలంగా ఉంది. గుజరాత్ లో మోడీ ఏ విధంగా అయితే స్థానికతను, గుజరాతీయుల ఐక్యత భావనను ఎన్నికల్లో ప్రధానంగా వాడుకున్నారో… కన్నడిగులను కూడా అదే తరహాలో ఐక్యం చేసే పనిలో సిద్ధరామయ్య ఉన్నారు. సో.. అక్కడ హింధుత్వ భావన, లేదా మోడీ మేనియా లాంటివి అంత ఈజీగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక, భాజపా తరువాతి లక్ష్యాలుగా ఉన్న రాష్ట్రాలు… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో అధికార తెరాసతో పొత్తు లేదు కాబట్టి, అక్కడి భాజపా నేతలు ఈ ఫలితాలను ఎలా అన్వయించుకున్నా ఫర్వాలేదు. కానీ, ఆంధ్రాలో అక్కడి అధికార పార్టీ టీడీపీతో భాగస్వామ్య పక్షం. రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీల మధ్యా ఉండాల్సినంత గ్యాప్ కూడా ఉంది కదా! దీంతో గుజరాత్ ఫలితాల రెండు పార్టీలూ రెండు రకాలుగా చూస్తున్నాయి.
పోలవరం ప్రాజెక్టు విషయంలోగానీ, ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాల్లోగానీ తమకు ప్రాధాన్యత లేకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నారనేది పురందేశ్వరి, సోము వీర్రాజు వంటి నేతల ఆరోపణ. ఇక, ఈ ఫలితాల నేపథ్యంలో వారి విశ్లేషణ ఏంటంటే… గుజరాత్ లో విజయం సాధించడంతో భాజపా బలం మరింతగా పెరింగిందనీ, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాకి భాజపా మాత్రమే ప్రత్యామ్నాయమౌతుందని సోము వీర్రాజు వ్యాఖ్యానిస్తున్నారు! కమల బలం రోజురోజుకీ పుంజుకుంటోంది కాబట్టి, వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో పొత్తు ఉన్నా… సీట్ల విషయమై తాము శాసించే స్థాయిలో ఉంటామని ఆయన అంటున్నారు. గుజరాత్ ఫలితాల వల్ల ఆంధ్రాలో తమకు ప్రాధాన్యత పెరుగుతుందనేది ఏపీ భాజపా నేతల విశ్లేషణ.
ఇక, టీడీపీ విషయానికొస్తే… మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనే భాజపా గెలిచేందుకు అష్టకష్టాలూ పడిందనీ, గతంతో పోల్చుకుంటే మెజారిటీ తగ్గిందనే కోణాన్ని వారు చూస్తున్నారు. ఏ పార్టీవారికి ఎంత స్థాయి ఇవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారనీ, గుజరాత్ ఫలితాలను అందరూ చూస్తున్నారనీ టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సీట్ల విషయమై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. అంతేకాదు, సోము వీర్రాజుతోపాటు పురందేశ్వరి తీరుపై భాజపా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెప్పడం విశేషం! గుజరాత్ లో తగ్గిన మెజారిటీ నేపథ్యంలో భాజపా దూకుడు కొంత తగ్గుతుందన్నది వీరి విశ్లేషణ. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీపై ఆధారపడాల్సిన అవసరం మోడీకి అర్థమౌతుంది కాబట్టి, టీడీపీ విషయంలో భాజపా వ్యవహార శైలి మారొచ్చనేది వారి లెక్క. ఇలా ఈ రెండు మిత్రపక్షాలూ గుజరాత్ ఫలితాలను చూస్తున్నాయి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు గుజరాత్ విజయం దోహదపడుతుందని భావిస్తున్నారు.