సొగసు చూడతరమా, చూడాలని వుంది, ఒక్కడు… ఇలా గుణశేఖర్ అందించిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఒకటా, రెండా? ఒకప్పుడు లీడింగ్ డైరెక్టర్. పెద్ద హీరోలంతా గుణశేఖర్ తో పని చేయాలని ఉవ్వీళ్లూరేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న దర్శకుడాయన. గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని చాలా కాలం నుంచి అనుకొంటున్నారు. తన స్టైల్ నీ, టీమ్ నీ మార్చి, స్టార్స్ ని పక్కన పెట్టి, కొత్త వాళ్లతో ఓ సినిమా తీశారు. అదే ‘యుఫోరియా’. ఫిబ్రవరి 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై గుణశేఖర్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు. ఈ సినిమాతో అయినా ఆయన కమ్ బ్యాక్ ఇస్తే బాగుణ్ణు అని అయన్ని అభిమానించేవాళ్లు కోరుకొంటున్నారు. గుణశేఖర్ లాంటి క్రియేటీవ్ దర్శకుడు హిట్ బాటలో పడితే అంతకంటే కావాల్సిందేముంది? కానీ ఇది అంత ఈజీ కాదు.
క్రేజీ కాన్సెప్టులు, సరదా కథలతో సాగుతోంది టాలీవుడ్. సంక్రాంతికి వచ్చి హిట్ అయిన సినిమాలన్నీ ఎంటర్టైనర్లే. ‘యుఫోరియా’ అలాంటి కథ కాదు. ఓ సీరియస్ సబ్జెక్ట్ ని తెరపై చూపించాలనుకొంటున్నాడు గుణశేఖర్. ట్రైలర్‌తో గుణశేఖర్ ఎలాంటి అంశాన్ని ఎంచుకొన్నారన్న విషయంలో ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చింది. అంత సీరియస్‌నెస్ చూడాలన్న కుతూహలం ఈనాటి ప్రేక్షకుడికి ఉందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సినిమాలో స్టార్స్ లేరు. గుణశేఖర్ ఒక్కడే తన భుజాలపై మోయాల్సిన సినిమా ఇది. పబ్లిసిటీ పరంగా కూడా మెరుపులేం లేవు. ఈ సినిమా కోసం గుణశేఖర్ ఒక్కడే మాట్లాడగలడు. ఆయన ఇప్పటికే వెబ్ మీడియాకు, యూ ట్యూబ్ ఛానళ్లకూ ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. అంటే ఈ సినిమా గురించి మాట్లాడడానికి ఎవరూ లేరు. ఈ రోజుల్లో పబ్లిసిటీ చాలా ఇన్నోవేటివ్ గా చేసుకోవాలి. ఏదో ఓ రూపంలో వార్తల్లో ఉండాలి. అలాంటి హంగామా ఏం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం సవాలే.
గుణశేఖర్ పై, ఆయన ప్రతిభపై ఇప్పటికీ నమ్మకం ఉన్నవాళ్లు ఉన్నారు. ఆయన కమ్ బ్యాక్ ఇవ్వాలని గట్టిగా ఎదురు చూస్తున్నారు. వాళ్లకు ఈ సినిమా నచ్చి, మౌత్ పబ్లిసిటీ తోడవ్వాలి. ఫిబ్రవరి 6న గుణశేఖర్‌కి పెద్దగా కాంపిటీషన్ కూడా లేదు. అదో ప్లస్ పాయింట్. ఏదేమైనా గుణశేఖర్ క్రియేటివిటీకీ, క్రెడిబులిటీకి ఈ సినిమా పెద్ద పరీక్ష. ఇందులో ఆయన పాస్ అవ్వాలనే కోరుకొందాం.
