అమెరికా డ్రీమ్‌కు ఆధారంగా నిలిచే హెచ్ వన్ బీ వీసా ఇక నుంచి లాటరీ రూపంలో రాదు. హెచ్-1బీ వీసా ఎంపిక ప్రక్రియలో ఇప్పుడు సమూల మార్పులు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో కంప్యూటర్ ద్వారా లాటరీ పద్ధతిలో విజేతలను ఎంపిక చేసేవారు. కానీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఈ విధానాన్ని స్వస్తి పలికి, వాల్యూ బేస్డ్ ఎంపికకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది. అభ్యర్థి నైపుణ్యం , వారికి ఇచ్చే వేతనంపై ఆధారపడి హెచ్ వన్ బీ జారీ చేస్తారు.
అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను రక్షించడమే లక్ష్యంగా తెచ్చిన ఈ మార్పుల వల్ల, తక్కువ వేతనాలతో విదేశీయులను నియమించుకునే ‘అవుట్సోర్సింగ్’ కంపెనీలకు చెక్ పడుతుందని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. తక్కువ జీతాలతో ఎక్కువ మందిని పంపే సంస్థలు లాటరీలో అధిక శాతం వీసాలను దక్కించుకునేవని.. ఇప్పుడు అధిక నైపుణ్యం ఉండి, గరిష్ట వేతనం పొందే వారికి ఎంపికలో మొదటి ప్రాధాన్యత లభిస్తుందని ప్రకటించింది. దీనివల్ల నైపుణ్యం ఉన్న భారతీయులకు, ముఖ్యంగా ఐటీ నిపుణులకు మెరుగైన అవకాశాలు లభించే వీలుంది.
నియామక సంస్థలు కూడా వీసా దక్కించుకునే అవకాశాలను పెంచుకోవడానికి కంపెనీలు ఇప్పుడు అభ్యర్థులకు భారీ జీతాలు ఆఫర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అత్యధిక వేతనం ఎవరికి ఇస్తారో వారికి వీసా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కంపెనీలపై ఆర్థిక భారం పెంచినప్పటికీ, అత్యుత్తమ ప్రతిభావంతులను మాత్రమే అమెరికాకు రప్పించేలా చేస్తుందని ట్రంప్ నమ్మకంగా ఉన్నారు. హెచ్-1బీ వీసా ఇప్పుడు కేవలం ఒక లాటరీ గేమ్ కాదు, అది ఒక మెరిట్ ఆధారిత వ్యవస్థగా మారుతోంది. ఎక్కువ జీతం – ఎక్కువ ప్రాధాన్యత పాయింట్ ఆధారంగా వీసాలు ఇస్తారు.
