సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాద గుంపులు ఉన్నాయని గుర్తించిన భారతీయ సైన్యం జర్జికల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఎల్వోసీ కంచె దాటి, పాక్ భూభాగంలోకి చొరబడి ముష్కర మూకల్ని మన సైన్యం మట్టుబెట్టింది. పాక్‌లో ఉగ్రవాదం అంతమొందాలని వివిధ దేశాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఈ తరుణంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫీజ్ సయీద్ మీడియా ముందుకు వచ్చాడు. ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన హఫీజ్ పాకిస్థాన్‌లోని ఫైజలాబాద్‌లో ఓ సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా భారత్‌పై ఓ అడ్డగోలు విమర్శలు చేశాడు.
సర్జికల్ దాడులు అంటూ భారత్ కట్టుకథలు తయారుచేసి ప్రపంచానికి చెబుతోందన్నాడు. నిజానికి, సర్జికల్ దాడుల్లో పాక్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదనీ, నాలుగు గోడల మధ్య అల్లుకున్న కథను థోవల్ అందంగా చెబుతున్నారని విమర్శించాడు. నిజమైన సర్జికల్ దాడులు ఎలా ఉంటాయో భారత్‌కు పరిచయం చేసేందుకు పాక్ సైన్యం సిద్ధంగా ఉందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సైన్యానికి అనుమతులు ఇవ్వాలని హఫీజ్ కోరాడు. అంతేకాదు, యురీ సెక్టార్లో కశ్మీరీ ముజాహిద్దీన్ జరిపిన దాడులకు సంబంధించిన వాస్తవాలను భారత్ దాస్తోందన్నాడు. అక్కడ 19 మంది జవాన్లు మాత్రమే చనిపోయారని భారత్ చేస్తున్న ప్రకటనల్లో నిజం లేదన్నాడు. మొత్తంగా 177 మంది జవాన్లు మరణించారని చెప్పాడు.
దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ సరిహద్దు దాటి భారత సైన్యం చొరబడిందనీ, ఈ చర్యకు బదులు తీర్చుకుంటామని ఈ ఉగ్రవాది అన్నాడు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సైన్యానికి కావాల్సిన అనుమతులు ఇవ్వాల్సింది ప్రధానిని మరోసారి కోరాడు. చిత్రం ఏంటంటే… దేశసైన్యం గురించి ఒక ఉగ్రవాది ప్రధానమంత్రికి సూచనలు ఇవ్వడం! పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఏ స్థాయిలో మద్దతు పలుకుతోందో హఫీజ్ వ్యాఖ్యల్ని బట్టీ అర్థం చేసుకోవచ్చు. మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టు ఇలా సమావేశాలు ఏర్పాటు చేసుకునేంత స్వేచ్ఛ పాకిస్థాన్‌లోనే సాధ్యం. స్వదేశంలో ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ.. టెర్రరిజంపై తామూ పోరాటం చేస్తున్నామని అంతర్జాతీయ వేదికలపై పాక్ నమ్మబలుకుతున్న తీరు ద్వంద్వ వైఖరికాక ఇంకేమౌతుంది చెప్పండి!