భారతదేశం ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. మన దేశంలో టీచర్లు, బడుల స్థితిగతుల గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ప్రపంచంలో టీచర్లకు అత్యధిక వేతనం, గౌరవం లభించే దేశాలు ఏమిటో ఆ వివరాలు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
ఆచార్య దేవోభవ అనే పదం తెలియకపోయినా, అచ్చ అలాగే వ్యవహరించే దేశాల్లో స్విస్, చైనాలు ముందు వరుసలో ఉన్నాయట. వేతనాల పరంగా స్విట్జర్లాండ్, గౌరవం పరంగా చైనా టీచర్లకు స్వర్గధామం వంటి దేశాలట.
స్విస్ టీచర్లకు సగటున ఏడాదికి 68 వేల డాలర్ల వేతనం లభిస్తుందట. భారతీయ కరెన్సీలో ఇది 45 లక్షల రూపాయలకు పైమాటే. ఆ దేశంలో సగటు వేతనం (50 వేల డాలర్ల) కంటే టీచర్లకే ఎక్కువ వేతనాలు లభిస్తున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో నెదర్లాండ్స్, జర్మనీ, బెల్జియం ఉన్నాయి. ఐరోపాలో టీచర్లకు అత్యధికంగా వేతనాలిచ్చే దేశం ఇంగ్లండ్. అక్కడ టీచర్ల వార్షిక సగటు వేతనం 27 వేల పౌండ్లు. అంటే సుమారు 44 వేల డాలర్లు. ఈ విషయంలో ఆసియాలోని రెండు దేశాలు టాప్ 10 లో ఉన్నాయి. దక్షిణ కొరియా 5, జపాన్ 7వ ర్యాంకు పొందాయి.
దేశం బాగుపడాలంటే విద్యా వ్యవస్థ బలంగా ఉండాలని అభివృద్ధి చెందిన దేశాలు నమ్ముతాయి. అందుకే అక్కడ విద్యాశాఖ మంత్రికే ఎక్కువ విలువ. అమెరికాలో చదువుమీద ఎక్కువగా ఖర్చు పెడతారు. ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయి. అగ్రరాజ్యం విద్య మీద పెట్టే ఖర్చు 800 బిలియన్ డాలర్లకు పైనే. రెండో స్థానంలో ఉన్న జపాన్ ఖర్చు 160 బిలియన్ డాలర్లు. దీన్ని బట్టే అర్థమవుతుంది, విద్యపై అమెరికా ఏ స్థాయిలో ఖర్చు పెడుతుందో. ఇక జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇంగ్లండ్ లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచం మొత్తం మీద ఉన్న టీచర్లలో 68 శాతం మంది మహిళలేనట. అందుకే, టీచర్ కెరీర్ ప్రధానంగా లేడీస్ కెరీర్ అని చాలా మంది అభిప్రాయం.