‘హరి హర వీరమల్లు’ మరి కొద్ది గంట్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈలోగా వీరమల్లు ఫీవర్ తెలుగు రాష్ట్రాల్లో పాకేసింది. ఎక్కడ చూసినా వీరమల్లు టాపిక్కే. నిన్నా మొన్నటి వరకూ ఈ సినిమాని పట్టించుకొన్నదే లేదు. ఫ్యాన్స్ కూడా ఎప్పుడూ ‘ఓజీ… ఓజీ’ అంటూ అరిచారు కానీ, వీరమల్లు పై వాళ్లూ పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ వారంలోనే సీన్ మొత్తం మారిపోయింది. పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్‌కి రావడం, ప్రీ రిలీజ్ ఫంక్షన్ సక్సెస్ కావడంతో హైప్ చాపకింద నీరులా పెరిగిపోయింది. ఏపీలో ఈరోజు రాత్రి 9.30 గం. నుంచే ప్రీమియర్లు పడిపోతున్నాయి. ఓ ఊర్లో నాలుగు థియేటర్లు ఉంటే నాలుగింట్లోనూ ప్రీమియర్లు ప్లాన్ చేశారు. టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. బుక్ మై షోలో బుకింగులు జోరుగా సాగుతున్నాయి. ఎన్ని థియేటర్లు పెంచుకొంటూ వెళ్లినా.. అన్నీ ఫుల్స్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్ స్టామినా ఏపీలోనే అనుకొంటే, నైజాంలోనూ ఆ జోరు గట్టిగా కనిపిస్తోంది. ప్రీమియర్లతో బయ్యర్లు 20 శాతం రిటర్న్స్ రాబట్టుకొనే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. నిజంగా ఇది పెద్ద మొత్తమే.
‘వీరమల్లు’ గురించి ముందు నుంచీ ఎలాంటి హైప్ లేదు. క్రిష్ స్థానంలో జ్యోతికృష్ణ దర్శకుడవ్వడంతో ఇంకొంచెం అపనమ్మకం పెరిగింది. పైగా ప్రాజెక్ట్ చాలా డిలే అయ్యింది. బయ్యర్లు ఈ సినిమా కొనడానికి మీనమేశాలు లెక్కేశారు. టికెట్ రేట్లు కూడా పెంచారు. ఇవన్నీ చూసినప్పుడు వీరమల్లుకి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయి? అనే బెంగ వేసింది. కానీ బుకింగులు తెరవడం ఆలస్యం.. పవన్ అభిమానులు ఎగబడ్డారు. తొలిరోజు కచ్చితంగా పెద్ద నెంబర్లు చూసే అవకాశం ఉంది. టాక్ ఏంటో తెలీయకుండానే ఈ స్థాయి స్పందన ఉంటే, హిట్ అయితే ఇంకెలా ఉంటుందో అనిపిస్తోంది.
టాలీవుడ్ కి కూడా ఒక హిట్టు అత్యవసరం. సంక్రాంతి తరవాత బాక్సాఫీసు ముందుకు చెప్పుకోదగ్గ సినిమా రాలేదు. ఈ సీజన్లో వస్తున్న తొలి పెద్ద సినిమా ఇదే. తరవాత కింగ్ డమ్, వార్ 2, కూలీ ఉన్నాయి. వీరమల్లుతో ఊపొస్తే… మిగిలిన మూడు సినిమాలకూ ఆ జోష్ పాకడం ఖాయం.