ముందుగా వార్తల్లో వినిపించినట్లే పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు జూన్ 12న విడుదలవుతుందని భావించిన మెగా ఫ్యాన్స్ కి మరోసారి నిరాశ ఎదురైంది. ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా పడినట్లు టీమ్ తాజాగా ప్రకటించింది.
‘‘ జూన్ 12వ తేదీకి ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేశాం. ఎంతో శ్రమించినప్పటికీ వివిధ కారణాల వల్ల ఆ రోజు సినిమాని విడుదల చేయలేకపోతున్నాం. ప్రతి ఫ్రేమ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాం. అందుకే మేము మరికొంత సమయం తీసుకుంటున్నాం. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాం’’ అని టీమ్ ప్రకటించింది. ఇదే సమయంలో సోషల్‌మీడియా వేదికగా జరిగే ప్రచారాలను ఏమాత్రం నమ్మవద్దని కోరింది. సినిమాకు సంబంధించిన విషయాలను తామే అధికారికంగా ప్రకటిస్తామని, అంతేకాకుండా త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుందని.. కొత్త విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని టీమ్ వెల్లడించింది.
వీరమల్లుని ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ ఈ సినిమాని చాలా అడ్డంకులు వచ్చాయి. దర్శకుడు క్రిష్ మధ్యలోనే ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయ్యారు. తర్వాత చిత్ర నిర్మాత కుమారుడు జ్యోతి కృష్ణ సినిమాని పూర్తి చేశారు. అయితే రిలీజ్ విషయంలో క్లారిటీ రావడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ కు సమయం సరిపోవడం లేదని నిర్మాతలు చెబుతున్నప్పటికీ దేనిపైనా స్పష్టత లేకుండా వుంది.
వాయిదా ప్రకటనలోనే కొత్త డేట్ ఇస్తారేమో అని భావించారంతా. కానీ కొత్త డేట్ లేదు. జూలై 4న ఈ సినిమా వచ్చే అవకాశం వుందని వినిపిస్తుంది. అదే డేట్ కి విజయ్ దేవరకొండ కింగ్ డమ్ వుంది. ఆ సినిమా నిర్మాత నాగవంశీ. హారిక హాసిని, సితార బ్యానర్స్ అంటే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ హోమ్ బ్యానర్స్ అనే చెప్పాలి. వాళ్ళ స్నేహం గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూలై 4కి వీరమల్లు రెడీ అయితే గనుక ఆ డేట్ పవన్ సినిమాకి ఇవ్వడం పెద్ద విషయం కాదు.