Hari Hara Veera Mallu Movie Review
–రివ్యూ బై అన్వర్
తెలుగు360 రేటింగ్ 2/5
కొన్ని రోజులుగా ‘హరి హర వీరమల్లు’ ఫీవర్ తో టాలీవుడ్ ఊగిపోయింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం అయిన తరవాత పవన్ కల్యాణ్ నుంచి వస్తున్న సినిమా ఇది. రీమేకుల్ని వదిలి పవన్ చేసిన స్ట్రయిట్ సినిమా ఇది. చారిత్రక నేపథ్యం, సనాతన హిందూ ధర్మం ఇవన్నీ కలిసిన దొంగ కథ ఇది. చాలా ఏళ్లుగా సెట్స్ పైనే ఉండిపోయినా, క్రిష్ నుంచి దర్శకత్వ పగ్గాలు జ్యోతికృష్ణ చేతుల్లోకి మళ్లినా.. పవన్ క్రేజ్ ముందు అవన్నీ చిన్నవైపోయాయి. పవన్ కల్యాణ్ సినిమా అంటే ఎంత హైప్ ఉంటుందో అంతకు మించిన క్రేజ్ తెచ్చుకొన్న సినిమా ఇది. మరి… ఇంత హంగామాతో విడుదలైన ‘వీరమల్లు’ ఎలా ఉన్నాడు? పవన్ అభిమానులు ఆశించిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయా? అసలు ‘వీరమల్లు’ బలాబలాలేమిటి?
అవి మొఘల్ చక్రవర్తుల పరిపాలన జరుగుతున్న రోజులు. ఔరంగజేబ్ (బాబీ డియోల్) అధికారాన్ని హస్తగతం చేసుకొన్నాడు. హిందూమతాన్ని అంతం చేసి, తన మతాన్ని భారతదేశంలో విస్తరించాలన్న సంకల్పంతో పరిపాలన సాగిస్తున్నాడు. తన మాట వినని సామంత రాజుల్ని క్రూరంగా అడ్డు తొలగించుకొంటున్నాడు. మరోవైపు వీరమల్లు (పవన్ కల్యాణ్) కథ. అతనో దొంగ. కాకపోతే మంచి దొంగ. వజ్రాల్ని దొంగిలించడంలో మరింత దిట్ట. అతని చాకచక్యం చూసిన గోల్కొండ నవాబ్… వీరమల్లుకి ఓ పని అప్పగిస్తాడు. ఔరంగజేబ్ తమ నుంచి ఎత్తుకెళ్లిన కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురమ్మంటాడు. అందుకు వీరమల్లు ఒప్పుకొన్నాడా? ఔరంగజేబ్ లాంటి బలమైన శక్తిని ఓ దొంగ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ కథలో పంచమి (నిధి అగర్వాల్) పాత్రేమిటి? ఔరంగ జేబ్ వల్ల నాశనమవ్వబోతున్న సనాతన ధర్మాన్ని వీరమల్లు ఎలా రక్షించాడు? అనేది మిగిలిన కథ.
చారిత్రక నేపథ్యానికి ‘వీరమల్లు’ అనే ఓ ఫిక్షన్ పాత్రని జోడించి క్రిష్ రాసుకొన్న కథ ఇది. రాబిన్ హుడ్ లాంటి దొంగ, ఔరంగ జేబ్ లాంటి ఓ నిరంకుశ పాలకుడి దగ్గరున్న విలువైన వజ్రాన్ని ఎలా చేజిక్కించుకొంటాడు? అనేది ఆసక్తికరమైన ప్లాట్ పాయింటే. దానికి సనాతన ధర్మాన్ని జోడించాలన్నది కూడా మంచి ఆలోచన. ఎందుకంటే ఈమధ్య ఇలాంటి కాన్సెప్టులకు కాసులు రాలుతున్నాయి. ప్రేక్షకులు సెంటిమెంట్ గా ఇలాంటి కథలపై ఎటాచ్మెంట్ పెంచుకొంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా సనాతన ధర్మాన్ని రక్షించాలి.. అనే స్లోగన్ తో ముందుకు వెళ్తున్న నాయకుడు. సో.. ఎలా చూసినా రిలేటబుల్ పాయింట్‌ని క్రిష్ పట్టుకొన్నాడు. ఇవన్నీ చారిత్రక నేపథ్యాన్ని జోడించి చెప్పాలనుకోవడం మరో ప్లస్ పాయింట్. సెటప్ పరంగా ఎక్కడా ఎలాంటి లోటూ లేదు. పైగా పవన్ అనే శక్తి ఈ కథకు తోడైంది. కాబట్టి ఎలా చూసినా పైసా వసూల్ అవ్వగలిగే కంటెంట్ చేతిలో ఉన్నట్టే లెక్క.
ఇలాంటి కథకు ఎగ్జిక్యూషన్ చాలా ముఖ్యం. పేపర్ పై చాలా సన్నివేశాలు బాగున్నట్టే అనిపిస్తాయి. దాన్ని తెరపైకి తర్జుమా చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ చాలా ముఖ్యం. ఔరంగజేబ్ అనే ఓ మతోన్మాదిని తొలి సన్నివేశాల్లో పరిచయం చేసి, ‘నీలాంటి వాడ్ని మట్టుపెట్టడానికి ఒకడొస్తాడు.. వాడు రాజే కానవసరం లేదు. ఓ సామాన్యుడైనా చాలు..’ అనే డైలాగులతో హీరో ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకొన్నారు. ఆ తరవాత ఓ దొంగగా హీరోని పరిచయం చేయడం, వందలాది సైన్యాన్ని ఎదిరించి, విలువైన వజ్రాల్ని కాజేయడం ఇవన్నీ పవన్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసేవే. ఆ తరవాత బియ్యం బస్తాల కోసం ఉస్తాదులతో ఫైట్, అక్కడ చెప్పే కొన్ని డైలాగులు ఇవన్నీ కథపై నమ్మకాన్ని కలిగిస్తాయి. ఓ డీసెంట్ ఫిల్మ్ చూడబోతున్నాం అనే భరోసా ఇస్తాయి. పంచమి అనే పాత్రని పరిచయం చేసే విధానం కూడా బాగుంది. చార్మినార్ ఫైట్ సుదీర్ఘంగా సాగింది. అక్కడ మంచి ఎలివేషన్లకు స్కోప్ ఉంది. ఓ ఊహించని ట్విస్ట్ కూడా వస్తుంది. ఆ వెంటనే… గోల్కొండ నవాబ్ వీరమల్లుకు ఓ టాస్క్ ఇవ్వడం, అక్కడ పులి కళ్లల్లో పవన్ కళ్లు పెట్టి చూడడం బాగా కుదిరాయి. ఫస్టాఫ్ వరకూ వచ్చే సరికి పెద్దగా కంప్లైంట్స్ ఉండవు. డీసెంట్ ఎఫెక్ట్ అన్నట్టే అనిపిస్తుంది.
సెకండాఫ్‌లో రూట్ మ్యాప్ వేసుకొని, ఔరంగజేబ్‌ని వెదుక్కొంటూ వెళ్లడమే కథ. మార్గ మధ్యలో జరిగే పరిణామాలు, పాటలూ, ఫైటులతో నడిపించేశారు. అయితే ఆ నడక అంత సవ్యంగా సాగలేదు. వీరమల్లు దగ్గర ఓ సైన్యం ఉంటుంది. సైన్యం అంటే ఓ నలుగురు. రఘుబాబు, సుబ్బరాజు, సునీల్, నాజర్.. ఇలా అన్నమాట. ‘వాళ్లేదో పెద్ద తెలివైన వాళ్లు’ అన్నట్టు ముందు బిల్డప్ ఇస్తారు. తీరా చూస్తే ఇదంతా బిల్డప్పే అని తరవాత అనిపిస్తుంది. అసలు ఇలాంటి గ్యాంగ్ ని పెట్టుకొని ఔరంగజేబ్ లాంటి మహా బలశాలిని ఓ దొంగ ఎలా ఎదుర్కొంటాడు? అనిపిస్తుంది. వాళ్ల తెలివితేటలు హీరోకి ఎలా ఉపయోగడ్డాయి? అనేది ఎక్కడా చెప్పలేదు.
పంచమి పాత్రని పరిచయం చేయడం వరకే బాగుంది. ఆ పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ ఎందుకోసమో అర్థం కాదు. సెకండాఫ్‌లో ఓ పాటలో మెరవడం తప్ప పంచమి చేసిందేం లేదు. వీరమల్లు ప్రతీ చోటా.. ఓ ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ చుట్టూ ఓ ఎలివేషన్ ఉంటుంది. కానీ డ్రామా మాత్రం పండదు. డ్రామా పండినప్పుడే ఎంతటి యాక్షన్ అయినా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ అది జరగలేదు. హీరో కాబట్టి, చూస్తూ ఊరుకొంటే బాగోదు కాబట్టి, అన్యాయాన్ని ఎదిరించుకొంటూ వెళ్తాడు. ‘ఇప్పుడు హీరో రావాలి.. వస్తే బాగుణ్ణు..’ అనే వాతావరణం కల్పించలేదు. అలాంటప్పుడు డ్రామా ఎందుకు పండుతుంది? డ్రామా పండనప్పుడు ఎలివేషన్లు ఎందుకు వర్కవుట్ అవుతాయి? సనాతన ధర్మం అనే పాయింట్ కావాలని ఇరికించిన సరంజామా అనిపిస్తుంది. ఔరంగజేబ్ ని ఎదుర్కోవడానికి కథానాయకుడికి సొంత ఎజెండా, ఫ్లాష్ బ్యాక్ అవసరం ఏం వచ్చింది? అందుకోసం ఇంత ప్లానింగు వేసుకొని మరీ దొంగగా ఎందుకు మారాల్సివచ్చింది? అని ప్రశ్నించుకొంటే సమాధానాలు దొరకవు. చెక్ పోస్ట్ దగ్గర ఓ ఫైట్ ఉంది. పార్ట్ 1 అక్కడితో ఆపేస్తే బాగుండేది. కానీ ఓ తుఫాన్ ఫైట్ తో పార్ట్ 1కి శుభం కార్డ్ పలికారు. ఆ ఫైట్, అందులో చూపించిన గ్రాఫిక్స్ ఏమాత్రం వర్కవుట్ కాలేదు. పవన్ కల్యాణ్ – బాబీ డియోల్ చేయి చేయి పట్టుకొన్న లాస్ట్ షాట్. ‘ఆర్.ఆర్.ఆర్’ని గుర్తుకు తెస్తుంది. ఆ ఫైట్ తో సినిమాని ఆపడం అసంతృప్తిగా అనిపిస్తుంది.
వీఎఫ్ఎక్స్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొన్ని చోట్ల `ఓకే` అనిపించిన ఎఫెక్ట్స్ చాలా చోట్ల తేలిపోయాయి. డబ్బులు గుమ్మరిస్తే వీఎఫ్ఎక్స్ బాగా వచ్చేస్తాయి అనుకోవడం పొరపాటు. దానికో విజన్ అవసరం. ఓపిక అవసరం. ఎలాంటి వర్క్ ఎక్కడ చేయించుకోవాలి? అనే ప్రణాళిక అవసరం. అవేమైనా ఈ టీమ్ చేసిందా? అనే డౌటు వస్తుంది. పెద్ద పెద్ద సీజీలు తేలిపోయాయి అనుకొంటే ఓ మాట. గుర్రంపై హీరో ప్రయాణించే చిన్న చిన్న సీన్లలో కూడా సీజీలు పేలవంగా అనిపిస్తాయి. పులితో సీజీ ఈరోజుల్లో చాలా ఈజీ. ఎందుకంటే ప్రతీ కంపెనీలోనూ అలాంటి స్టాక్ షాట్స్ ఉంటాయి. వాటిని కూడా సరిగ్గా డీల్ చేయకపోతే ఎలా అనిపిస్తుంది? క్లైమాక్స్ లో ఓ తుఫాను సృష్టించాలనుకోవడం మంచి ఆలోచన. కానీ సీజీలు సరిగ్గా లేకపోతే ఇలాంటి సీన్లు అభాసుపాలవుతాయి. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోకపోతే ఎలా?
పవన్ కల్యాణ్ ఈ సినిమాని దఫదఫాలుగా పూర్తి చేశారు. కాబట్టి ఆయన సీను సీనుకోలా కనిపిస్తూ వెళ్లారు. అక్కడక్కడ పవన్ స్టైల్ లో కొన్ని సీన్లు కనిపిస్తాయి. ముఖ్యంగా నిధి అగర్వాల్ తో రొమాంటిక్ సీన్లు కొన్ని ఉన్నాయి. అక్కడ పాత పవన్ ని చూడొచ్చు. పవన్ తాను నమ్మిన సనాతన ధర్మాన్ని వీలైనంత వరకూ కథలోకి తీసుకొద్దామని గట్టిగా ప్రయత్నించారు. నిధి అగర్వాల్ కూడా ఒక్కోచోట ఒక్కోలా వుంది. తన మేకప్ కొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. నిధి మాత్రమే కాదు. చాలా పాత్రలు ఇలానే తయారయ్యాయి. బాబీ డియోల్ వల్ల ఔరంగజేబ్ పాత్రకు గంభీరత అబ్బింది. అయితే ఆ పాత్రని కూడా సరిగా వాడుకోలేదు. కోట శ్రీనివాసరావు చివరి సినిమా ఇది. ఆయన్ని తెరపై చూడడం ఓ జ్ఞాపకం. అయితే ఆ పాత్రకు వేరేవాళ్లు డబ్బింగ్ చెప్పారు. దాంతో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కోట మన మధ్య లేరు కాబట్టి.. చిత్రబృందానికి అంతకు మించిన ఆప్షన్ దొరికి ఉండదు.
కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ తో మంచి ఎలివేషన్లు ఇచ్చారు. పాటలూ బాగున్నాయి. భారీ కాన్వాస్ ఉన్న సినిమా ఇది. వీఎఫ్ఎక్స్ వర్క్ తేలిపోయినా, సెట్స్ బాగున్నాయి. రియలిస్టిక్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. క్రిష్ – జ్యోతికృష్ణ చేతుల్లో ఈ సినిమా తయారైంది. ఎవరు ఏ సీన్ తీశారో చెప్పలేం కానీ, పేపర్ పై బాగున్న సీన్లు… తెరపై తేలిపోయినట్టు అనిపించాయి. డైలాగులు కూడా గుర్తు పెట్టుకొనేలా లేవు. ‘పాలించే వాడికి కాళ్లే కాదు.. తల కూడా ఉందని తెలియాలి కదా’ అనే డైలాగ్ లో చాలా డెప్త్ వుంది. ఇలాంటి డైలాగులు మరిన్ని పడితే బాగుండేది. ఎ.ఎం.రత్నం ఖర్చుకి ఎక్కడా వెనుకంజ వేయలేదు. ఆ భారీదనం కనిపించింది. కోహినూర్ కోసం మొదలైన కథ.. దాన్ని చేజిక్కించుకోకుండానే ముగిసింది. బహుశా పార్ట్ 2 కోసం ఆ సెటప్ అలా వదిలేశారేమో? పార్ట్ 2కి ‘యుద్ధభూమి’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఆ యుద్ధంలో గెలవాలంటే మాత్రం ఈ టీమ్ ఇంకా కష్టపడాల్సిందే.
తెలుగు360 రేటింగ్ 2/5
–రివ్యూ బై అన్వర్