పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఇది చేదు వార్తే. ఈనెల 12న విడుదల కాబోతున్న ‘హరి హర వీరమల్లు’ వాయిదా పడింది. అధికారిక ప్రకటన రావడమే తరువాయి. వీఎఫ్ఎక్స్ పని పూర్తి కాకపోవడమే వాయిదాకు అసలు కారణం. విడుదలకు మరో 10 రోజుల సమయం కూడా లేదు. వీఎఫ్ఎక్స్ ఇంకా చేతికి రాలేదు. దాంతో హడావుడి మొదలైంది. ట్రైలర్ కట్ చేయడం బాకీ. ఆ తరవాత ప్రమోషన్లు ఉన్నాయి. చివరి నిమిషంలో హర్రీ బర్రీ ఎందుకు? అని వాయిదా నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఓవర్సీస్ డిస్టిబ్యూటర్లకు ఆల్రెడీ విషయాన్ని నిర్మాత ఎ.ఎం.రత్నం పాస్ చేశారని వినికిడి.
వీరమల్లు ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిన ప్రాజెక్ట్. పవన్ కల్యాణ్ సినిమా కాబట్టి, ఆలస్యమైనా పవన్ ఫ్యాన్స్ భరిస్తూ వచ్చారు. ఇప్పుడు మరో నెల వాయిదా. అంతే. కాకపోతే.. వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వల్ల కొన్ని సినిమాలు గందరగోళంలో పడబోతున్నాయి. ఈనెల 27న ‘వీరమల్లు’ రిలీజ్‌కు మంచి ఆప్షన్. కానీ అక్కడ ‘కన్నప్ప’ ఉంది. ”కన్నప్ప వాయిదా వేసే ఉద్దేశ్యాలు ఏమైనా ఉన్నాయా” అని మంచు విష్ణుని సంప్రదించినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. దానికి విష్ణు ఒప్పుకోలేదని తెలుస్తోంది. జులై 4న ‘కింగ్ డమ్’ ఉంది. ఆ సినిమా ఎలాగూ సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్లదే. సితార అంటే ఓరకంగా పవన్ కల్యాణ్ సంస్థే. మరి నాగవంశీ తన సినిమాను ఆపి, పవన్‌కు దారి ఇస్తారా? అనేది చూడాలి. ఆ తరవాత 11న వద్దామనుకొంటే అక్కడ ‘ఘాటీ’ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఆ సినిమా కూడా వాయిదాలు పడుతూ, పడుతూ నిన్ననే 11 ఫిక్స్ చేసుకొంది. సో.. ‘వీరమల్లు’ కాస్త ఆగి వద్దామనుకొన్నా సరైన డేట్ దొరకడం లేదు. పవన్ కోసం వీటిలో ఏ ఒక్క సినిమా తప్పుకొన్నా, తదుపరి షెడ్యూల్ కాస్త గందరగోళానికి గురవుతుంది. ఈసారి ‘వీరమల్లు’ డేట్ ఫిక్స్ చేస్తే మళ్లీ వాయిదా వేయడం అనేది జరక్కూడదు. కాబట్టి ఈసారి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తే దానికి కట్టుబడి ఉండాల్సిందే.