తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో రాష్ట్ర సచివాలయంలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీ సాక్షిగా టికెట్ల ధరలు పెంచబోమని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించి, ఇప్పుడు దానికి విరుద్ధంగా వరుసగా జీవోలు విడుదల చేయడం ప్రజలను, సభను తప్పుదోవ పట్టించడమేనని ఆరోపించారు.
ప్రభుత్వంలో పాలకుల మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్ణయాలకు అస్సలు పొంతన లేదని హరీష్ రావు మండిపడ్డారు. సంబంధిత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియకుండానే టికెట్ల పెంపు జీవోలు రావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. తన శాఖలో జరుగుతున్న నిర్ణయాల గురించి మంత్రి నిస్సహాయత వ్యక్తం చేయడం చూస్తుంటే, అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. తెర వెనుక ఉన్న ఆ రాజ్యాంగేతర శక్తి ఎవరో చెప్పాలన్నారు.
ఒక హీరో సినిమాకు అర్ధరాత్రి వరకు పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, మరొకరికి రాచమర్యాదలతో రెడ్ కార్పెట్ వేయడం చూస్తుంటే.. ప్రభుత్వం సినిమా పరిశ్రమను రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకుందని ఆరోపించారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో సినిమా పరిశ్రమను వివక్ష లేకుండా ఆదరించడం వల్లే అది అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం అహంకారంతో ఆ వాతావరణాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు. టికెట్ల రేట్ల పెంపు పేరుతో జరుగుతున్న కమిషన్ల దందా వెనుక ఉన్న శక్తుల వివరాలను త్వరలోనే బయటపెడతామని హరీష్ రావు ప్రకటించారు. ఈ అంశంపై విచారణ చేయిచాలని డిమాండ్ చేశారు.
