కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం తప్పు అయితే ఆ తప్పు అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర ప్రభుత్వానిదేనని హరీష్ రావు చెప్పుకొచ్చారు. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టు పై ఆయన తెలంగాణ భవన్ లో ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి రిపోర్టు బయట పెట్టిన తర్వాత చీల్చి చెండాడుతామని హెచ్చరించారు.
జస్టిస్ ఘోష్ కమిషన్ పరిధి దాటిందని.. కేసీఆర్ ను హింసించేందుకు ఈ రిపోర్టు ను తెచ్చినట్లుగా ఉందని ఆరోపించారు. ఇలాంటి రిపోర్టులు నిలబడవని.. చెల్లవని హరీష్ రావు స్పష్టం చేశారు. గతంలో ఇందిరా గాంధీపై జనతా పార్టీ ప్రభుత్వం, తర్వాత చంద్రబాబుపై వైఎస్ వేసిన కమిషన్ల రిపోర్టులు నిలబడలేదని గుర్తు చేశారు. సీరియల్స్లా సాగదీస్తున్నారని ఆరోపించారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే రేవంత్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు.
హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులో చెప్పిన దానికి భిన్నమైన అంశాలు లేవు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టాలనే నిర్ణయం హరీష్ రావే తీసుకున్నారు కానీ కేంద్రం కాదు. కేంద్రం వద్ద నిర్మాణానికి అనుమతులు తీసుసుకున్నారు. దానికే కేంద్రానిది తప్పని హరీష్ చెప్పుకొచ్చారు. హరీష్ మొదటి రియాక్షన్.. అంత స్ట్రాంగ్ గా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అసెంబ్లీలోనే ఈ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగనుంది. కేసీఆర్ హాజరైతే..కాళేశ్వరంపై ఏ టూ జడ్ ప్రజల ముందు ఉంటుందని అనుకోవచ్చు.