హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నారని జరుగుతున్న ప్రచారంతో బీఆర్ఎస్ అప్రమత్తమయింది. హరీష్ రావుతోనే అలాంటిదేమీ లేదని ప్రకటన చేయించింది. కేసీఆర్ మాటే తన మాట అని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టిన హరీష్ రావు.. ఆ పని అయిపోయిన తరవాత బీఆర్ఎస్ లో అంతర్గత పరిణామాలపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. కేసీఆర్ మాటే హరీష్ బాట అని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో అంతర్గత విబేధాలు లేవని హరీష్ రావు స్పష్టం చేశారు.
కేటీఆర్ గారికి నాయకత్వం అప్పగిస్తే నేను తప్పకుండా స్వాగతిస్తా ..ఒక కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడూ శిరసావహిస్తానని స్పష్టం చేశారు. తాను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను.. ఎన్ని సార్లు అడిగిన ఇదే చెప్తాను.. కేసీఆర్ గారు మా అధ్యక్షుడు ఆయన చెప్పింది నేను తూ.చా. తప్పకుండా పాటిస్తానన్నారు. హరీష్ రావు ప్రకటనతో బీఆర్ఎస్ లో ఏదో జరిగిపోతోందన్న కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారానికి బ్రేక్ పడే అవకాశాలు లేవు. ఇలాంటి స్పందన కోసమే ఎదురు చూసే వారు.. మరింతగా హరీష్ ప్రకటనలోని ద్వందార్థాలు వెదుక్కుని ప్రచారం చేసే అవకాశం ఉంది.
నిజానికి ఇలాంటి టాపిక్ మీద స్పందించడం అంటే.. అవి మరింతగా ప్రచారం జరగడానికి ఆజ్యం పోయడమే. ఇప్పుడు అదే జరిగే అవకాశారు. హరీష్ రావుతో పాటు కవిత కూడా అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆమె కూడా సీఎం అవ్వాలన్న ఆశతో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తన కోరికల్ని జోస్యాల రూపంలో బయట పెట్టుకుంటున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ లో ఏమైనా జరుగుతుందో లేదో కానీ.. ఇలాంటి ప్రకటనల వల్ల.. మాత్రం మరింతగా చర్చ జరుగుతుంది.