మాజీమంత్రి హరీష్ రావు ఫార్ములా ఈ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు. ఫార్ములా ఈ రేసుతో హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ తెచ్చామని ఓ వైపు కేటీఆర్ చెబుతుంటే.. హరీష్ రావు మాత్రం అబ్బే అదేం లేదనే తరహలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆయన నేరుగా ఈ కామెంట్స్ చేయలేదు కానీ, మిస్ వరల్డ్ పోటీలపై హరీష్ చేసిన వ్యాఖ్యలను లింక్ చేస్తూ కాంగ్రెస్ ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతోన్న కార్యక్రమాలపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ అందాల పోటీలను నిర్వహించడంపై భగ్గుమన్నారు. అందాల పోటీలను నిర్వహించడం వలన రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందన్నారు. హరీష్ చేసిన ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు.
రాజకీయాలు ఎలా ఉన్నా, ఫార్ములా ఈ రేసును హైదరాబాద్ లో నిర్వహించడమంటే నగరం ఇమేజ్ పెరగడమే. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. అలాగే మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక అవ్వడం కూడా నగర కీర్తిని మరింత పెంచడమే. రెండు అంతర్జాతీయ ఈవెంట్స్ కు హైదరాబాద్ వేదిక కావడమంటే తెలంగాణకు గర్వకారణమే.
కానీ, మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ లో నిర్వహించి చెడ్డపేరు వచ్చిందని హరీష్ అన్నారంటే.. నగర ఖ్యాతి తగ్గించడమే. అంతేకాదు… ఫార్ములా ఈతోనూ రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందని చెప్పడమే అవుతోంది. ఎందుకంటే..ఫార్ములా ఈలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలోనే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు కూడా జారీ చేసింది.
దీన్నే కాంగ్రెస్ నేతలు హైలెట్ చేస్తున్నారు. అందాల పోటీలతో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందని అన్నారంటే… ఫార్ములా ఈతోనూ రాష్ట్రానికి ఒరిగిందేం లేదని చెప్పడమే అంటూ లాజిక్ తో కౌంటర్ ఇస్తున్నారు.