హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించే బాధ్యతలే కాదు గతంలో ఈటల నిర్వహించిన బాధ్యతల్ని కూడా తీసుకుంటున్నారు మంత్రి హరీష్ రావు. గతంలో వైద్య మంత్రిగా ఉన్న ఈటల ను బర్తరఫ్ చేసిన తర్వాత ఆ బాధ్యతల్లో ఎక్కువగా హరీష్‌కే కేసీఆర్ ఇచ్చారు. ఆ తర్వాత ఉపఎన్నికల కోసం హుజూరాబాద్‌కు ఇంచార్జ్‌గా కూడా హరీష్‌నే నియమించారు. తాజాగా నిన్నామొన్నటి వరకూ ఈటల అధ్యక్షుడిగా ఉన్న ఎగ్జిబిషన్ సొసైటీకి హరీష్ రావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా హరీశ్ రావు ఎన్నికయినట్లు యాజమాన్య కమిటీ ప్రకటించింది. నతమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఎగ్జిబిషన్ సోసైటీని మరింత ముందుకు తీసుకెళ్తానని.. హరీష్ రావు హమీ ఇచ్చారు. నాంపల్లిలో ప్రతీ ఏటా జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జానారెడ్డి అధ్యక్షుడగా ఉండేవారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈటల అధ్యక్షుడిగా ఉన్నారు. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన కీలక అధ్యక్షుడు అధ్యక్షుడిగా ఉంటూ ఉంటారు. ఈటలకు టీఆరెఎస్‌తో చెడటంతో ఆయనపదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. ఆ సమయంలో కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి.
ఆ తర్వాత సోదాల సంగతి ఏమయిందో కానీ ఇప్పటికైతే… హరీష్ రావును తమ అధ్యక్షుడిగా ఎన్నుకుని సమస్యను పరిష్కరించుకున్నారని అనుకోవాలి. సొసైటీకి పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. కొన్ని విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. అందుకే ఈ సొసైటీ సభ్యులు ఎక్కువగా రాజకీయ గొడవలు లేకుండా ఏపార్టీ అధికారలో ఉంటే ఆ పార్టీ వారని అధ్యక్షుడిగా ఎన్నుకుని ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉంటారు.