కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీలో ప్రవేశపెడితే ఏదో జరిగిపోతుందని.. హరీష్ రావు కంగారు పడుతున్నారు. హడావుడిగా అసెంబ్లీలో పెడుతున్నారని ఆరోపిస్తూ వస్తున్న ఆయన అసెంబ్లీ ప్రారంభమైన రోజే.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశ పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. కానీ ఆ లంచ్ మోషన్ సాయంత్రం వరకూ విచారణకు రాలేదు.
ఆదివారమే.. కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకే హరీష్ రావు హుటాహుటిన లంచ్ మోషన్ దాఖలు చేశారు. నిజానికి ఈ నివేదికను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని చెప్పి కేసీఆర్, హరీష్ గతంలోనే పిటిషన్లు వేశారు. కానీ కోర్టు వాటిని తిరస్కరించింది. ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి సమగ్రంగా చర్చించిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు ప్రభుత్వం చెప్పింది. దాంతో నివేదికపై స్టే ఇవ్వడానికి కూడా హైకోర్టు నిరాకరించింది. అయినా హరీష్ మరో ప్రయత్నం చేస్తున్నారు.
అసెంబ్లీలో నివేదిక ప్రవేశ పెట్టిన తర్వాత పూర్తిగా విషయం .. అసెంబ్లీ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఆ నివేదికకు చట్టబద్ధతపై కోర్టులు కూడా ఏ నిర్ణయమూ తీసుకోలేవు. అసెంబ్లీకే సర్వాధికారాలు ఉంటాయి. అయితే ఆ రిపోర్టు పేరుతో చర్యలు తీసుకోవాలంటే మాత్రం చట్ట పరిధిలో కోర్టు పరిధిలోనే తీసుకోవాలి. ఆ నివేదికలో కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే అంశాలున్నాయని హరీష్ రావు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే బయటకు రాకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నారు.