అలా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందో లేదో, ఫామ్ హౌజ్ లో కేసీఆర్ తో భేటీ అయి సమాలోచనలు మొదలు పెట్టారు హరీష్ రావు. అసలు విచారణకు వెళ్లాలా? లేదంటే నోటీసులపై కోర్టును ఆశ్రయించాలా? అని చర్చించారు. అయితే, కాళేశ్వరం తమ మానసపుత్రిక అని చెప్పుకొని , ఇప్పుడు ఆ ప్రాజెక్టు వ్యవహారంలో వచ్చిన నోటీసులపై కోర్టును ఆశ్రయిస్తే కేసీఆర్ పై జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే ఈ విషయంలో మధ్యేమార్గంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కాళేశ్వరం కమిషన్ ఎదుట ఇప్పటివరకు హాజరైన అధికారులు దాదాపు పైనుంచి అందిన ఆదేశాలతోనే ప్రాజెక్టు డిజైన్ జరిగిందని, కేసీఆరే ఆదేశాల మేరకు నడుచుకున్నామని చెప్పినట్లుగా సమాచారం. దాంతో ఈ వ్యవహారంలో న్యాయనిపుణులతో చర్చించి విచారణకు హాజరు కావాలా? లేదంటే మరికొంత సమయం ఇవ్వాలని కోరాలా ? అనేది తర్వాత నిర్ణయిద్దామని హరీష్ తో కేసీఆర్ అన్నట్లుగా తెలుస్తోంది. ఈమేరకు ఫామ్ హౌజ్ లో కేసీఆర్ న్యాయనిపుణులతో భేటీ అయి విచారణకు హాజరయ్యే అంశంపై చర్చించనున్నారు.
కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు అవుతేనే బాగుంటుంది అనేది మెజార్టీ అభిప్రాయం. కానీ, కేసీఆర్ మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదని బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోన్న ప్రచారం. కాళేశ్వరంను బీఆర్ఎస్ ఇప్పటికీ క్లెయిం చేసుకుంటుడంతో దాన్ని అలాగే కొనసాగించాలని అనుకుంటే తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిందే. అందుకే విచారణకు హాజరై..నిబంధనల మేరకే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని , ప్రమాదవశాత్తు భూమిలోకి ఇసుక వెళ్లడంతో ఘటన జరిగిందని చెబితే కేసీఆర్ కు రిస్క్ ఉండదని నిపుణుల అభిప్రాయం.
దీంతో కేసీఆర్ ఈ విషయంలో న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, హరీష్ రావు మాత్రం న్యాయనిపుణుల సలహాలతో తప్పనిసరిగా విచారణకు హాజరు అవ్వనున్నట్టు తెలుస్తోంది.