ట్యాపింగ్ కేసులో భాగంగా విచారణకు హాజరైన హరీష్ రావు .. సిట్ అధికారులకు దొరికిపోయినట్లుగా కనిపిస్తోంది. ఏడుగున్నర గంటల విచారణ తర్వాత బయటకు వచ్చి.. తెలంగాణ భవన్ లో ప్రెస్‌మీట్ పెట్టి.. విచారణ వీడియోని రిలీజ్ చేయాలని విచిత్రమైన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై తనకేం సంబంధం అని ..తాను హోంమంత్రిగా చేయలేదన్నారు. అప్పటి డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్‌లను అడగాలని ఎదురుదాడి చేశారు. అంతే కాదు..తానే వారిని ఇంటరాగేట్ చేశానని..తనను ప్రశ్నలు అడగలేదన్నట్లుగా చెప్పుకొచ్చారు.
విచారణ అధికారులకు ప్రతి అరగంటకోసారి ఫోన్లు వచ్చాయని.. అవి సజ్జనార్ చేశారా.. రేవంత్ రెడ్డి చేశారా అని హరీష్ రావు ప్రశ్నించారు. విచారణ వీడియో బయటపెట్టాలి. చిల్లర లీక్ లు ఇచ్చి, తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలి. సిట్ విచారణలో ఏదో జరిగిపోయిందనే పుకార్లు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. నిజానికి హరీష్ రావు విచారణపై ఇంకా ఎలాంటి పుకార్లు రాలేదు. ప్రచారాలు జరగలేదు. అయితే తాను చెప్పింది బయటకు వస్తుందని ఆయన కంగారు పడినట్లుగా కనిపిస్తోంది.
అదే సమయంలో విచారణ అంతా ఒక పెద్ద ట్రాష్ అని, నిరాధారమైన ఆరోపణలతో అడిగిందే అడుగుతూ కాలయాపన చేశారని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య గొడవలు, టెండర్ల దోపిడీపై చర్చను మళ్లించడానికే ఈ ‘సిట్టు-లట్టు-పొట్టు’ డ్రామాలు ఆడుతున్నారని ఉద్యమాలు, అరెస్టులు తమకు కొత్త కాదని చెప్పుకొచ్చారు.
హరీష్ రావు స్పందన చూస్తూంటే.. సిట్ విచారణ అంతా ఈజీగా సాగలేదని పక్కా సాక్ష్యాలతోనే ఆయనను ప్రశ్నించారని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయనలో ఎప్పుడూ లేనంతకంగారు కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
