ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ గురించి ట్వీట్ చేసిన సజ్జనార్.. ఇల్లీగల్ ట్యాపింగ్ అనే పదం వాడినందుకు హరీష్ రావు ఆవేశపడ్డారు. చాలా పెద్ద ట్వీట్ ను రిప్లయ్ గా ఇచ్చారు. కోర్టు తీర్పు రాకముందే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని సజ్జనార్ ఎలా సంబోధిస్తారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని హరీష్ రావు కోపగించుకున్నారు. దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా ఉండాలని, పోలీసులే జడ్జిలుగా మారి తీర్పులు ఇవ్వకూడదని ఆయన సూక్తులు కూడా చెప్పారు.
అయితే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పినందుకు హరీష్ ఇంత ఆవేశపడ్డారేమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే సిట్ దర్యాప్తు చేస్తోంది చట్టబద్ధంగా జరిగిన ట్యాపింగ్ మీద కాదు, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల సహకారంతో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ అంశంపైనే. ఫిర్యాదులో ఉన్న అంశమే అక్రమ ట్యాపింగ్ అయినప్పుడు, దర్యాప్తు అధికారి ఆ పదజాలాన్ని వాడటంలో తప్పేముందని న్యాయ నిపుణుల అభిప్రాయం.
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, టెలిగ్రాఫ్ చట్టం , సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తుంగలో తొక్కి సాగించిన వ్యవహారాన్ని ప్రాథమికంగా ఇల్లీగల్ గానే పరిగణించి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తారు. సజ్జనార్ తన అధికారిక సందేశంలో దర్యాప్తు పరిధిని పేర్కొన్నారే తప్ప, అది తుది తీర్పు కాదని స్పష్టమవుతోంది. ఈ చిన్న లాజిక్‌ను పక్కన పెట్టి, కేసీఆర్‌ను గౌరవ ప్రతిపక్ష నేతగా గుర్తించడం లేదని రాజకీయ రంగు పులమడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా ఆధారాలు ఉన్నాయిని.. కానీ అది లీగల్ ట్యాపింగ్ గా ముద్ర వేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇల్లీగల్ కాదని..లీగల్ అని వాదించేందుకు ఇలా సజ్జనార్ తోనే వాదన పెట్టుకుంటున్నట్లుగా భావిస్తున్నారు.
