తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రకటనల యుద్ధం జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ ప్రభుత్వ నిధులతో కాంగ్రెస్ పార్టీ భారీగా మీడియాలో ప్రకటనలు ఇస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు ఆరోపించారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సీజన్ ప్రారంభమయింది. కేరళలో తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చినట్లుగా హరీష్ రావు చెబుతున్నారు. అయితే హరీష్ రావు ఈ ఆరోపణలు చేసినప్పుడు అందరికీ గతమే గుర్తుకు వస్తుంది.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దీనికన్నా భారీ స్థాయిలో ప్రకటనలు ఇచ్చిన వ్యవహారాన్ని సోషల్ మీడియాలో అందరూ గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న సమయంలో ప్రచారం కోసం పథకాల పేర్లతో విస్తృతంగా ప్రకటనలు ఇచ్చేవారు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోని పత్రికల్లో తెలంగాణ పథకాలపై కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రకటనలు ఇచ్చారు. ఏ చిన్న పత్రికనూ వదల్లేదు. ఇక ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా సంగతి చెప్పాల్సిన పని లేదు.
అటు ఉత్తర భారత పత్రికల నుంచి ఇటు కన్నడ, మరాఠీ పత్రికల వరకు తెలంగాణ మోడల్ పేరుతో ప్రకటనలు వెల్లువెత్తాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సొమ్ముతో రాజకీయ ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వ విజయాల గురించి ఆయా రాష్ట్రాల్లో ప్రచారం అవసరం లేదు. కేవలం అక్కడి కాంగ్రెస్ కే ఉపయోగపడుతుంది. విపక్షంలో ఉన్నప్పుడు అన్యాయంగా కనిపించే ఖర్చు, అధికారంలోకి రాగానే విజయాల ప్రచారం గా మారిపోతుందా అన్న ప్రశ్నలు ప్రభుత్వానికి వస్తున్నాయి.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఇతర రాష్ట్రాల ఓటర్లను ఆకట్టుకోవడానికి తెలంగాణ పన్ను చెల్లింపుదారుల సొమ్మును వాడటం అనేది రాజకీయ నైతికతకు విరుద్ధమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఒకరు చేసిన తప్పును మరొకరు సమర్థించుకుంటూ విమర్శలు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.


