ఒక్క రీ ట్వీట్.. ఒకే ఒక్క రీ ట్వీట్.. హరీష్ శంకర్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్ అయ్యేలా చేశాయి. ట్విట్టర్ లో చాలా యాక్టీవ్ గా ఉంటారు హరీష్. ఫ్యాన్స్ కామెంట్ ని కూడా ఫాలో అవుతారు. రీ ట్వీట్ చేస్తారు. అలా ఆయన చేసిన ఓ రీ ట్వీట్.. ఆయన్ని ఇబ్బందుల్లో పెట్టింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్ తో మహేష్ బాబు రికార్డులు చెరిగిపోవాలి’ అనే అర్థం వచ్చేలా ఓ ఫ్యాన్ ట్వీట్ చేస్తే.. దానికి ‘తథాస్తు’ అనే కామెంట్ జోడించి రీ ట్వీట్ చేశారు హరీష్. ఇప్పుడు అదే మహేష్ ఫ్యాన్స్ కోపానికి కారణమైంది. జరిగిన తప్పిదాన్ని త్వరగానే గ్రహించిన హరీష్.. ఆ ట్వీట్ ని డిలీట్ చేశారు. అయితే అప్పటికి అది వైరల్ అయిపోయింది. దాంతో.. మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పారు హరీష్. ట్వీట్ పూర్తిగా చదవలేదని, తొందర్లో రీ ట్వీట్ చేశారని, ఆ మిస్ కమ్యునికేషన్ వల్ల మహేష్ ఫ్యాన్స్ హర్టయ్యారని క్లారిటీ ఇచ్చారు.
తెలుగు 360 ఇంటర్వ్యూలోనూ ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ”గద్దల కొండ గణేష్ రిలీజ్ అయ్యాక, మా సినిమాని మెచ్చుకొంటూ మహేష్ గారు ట్వీట్ చేశారు. ఆ సినిమాతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన సినిమాలకు నేను సహాయ దర్శకుడిగానూ పని చేయలేదు. అయినా సరే.. ఆయన మా సినిమాని ప్రమోట్ చేశారు. అలాంటి మంచి వ్యక్తిని ఏమైనా అంటే నా కళ్లు పోతాయ్.. ఏదో కంగారులో చేసిన తప్పిదమే అది. అందుకే సారీ చెప్పా. మహేష్ అభిమానులు నన్ను తిడుతూ ట్వీట్లు చేశారు. వాటిని డిలీట్ చేయలేదు. అలాగైనా వాళ్ల కోపం చల్లారుతుందని నా ఆశ” అన్నారు. మహేష్ అంటే తనకు చాలా ఇష్టమని, ఒకొక్క దర్శకుడి సినిమాలో ఆయన ఒక్కోలా కనిపిస్తారని, పోకిరిలో ఆయన చూపించిన యాటిట్యూడ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు హరీష్. మహేష్ తో పని చేసే అవకాశం వస్తే, పోకిరిలాంటి సినిమా తీస్తానన్నారు. హరీష్ ఇచ్చిన క్లారిటీతో మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు కాస్త స్థిమితపడ్డారనిపిస్తోంది. వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
