హైదరాబాద్: బీహార్‌కు ప్యాకేజిల ప్రకటనద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే విధంగా, కేంద్రం నిధులివ్వటంలేదని నిందిస్తున్న ప్రత్యర్థి కూటమి నోరు మూయించటం, ఇటు నిధుల ఆశ చూపి ఓటర్లను బుట్టలో వేసుకోవటం అనే రెండు ప్రయోజనాలు నెరవేరాయని బీజేపీ వర్గాలు సంబరపడుతున్నాయి. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ గంట మరికొద్దిరోజులలో మోగుతుందనగా బీహార్‌కు భారీ ప్యాకేజి ప్రకటించటం ఏ విధమైన రాజనీతిజ్ఞత అన్న ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఢిల్లీ ఎన్నికలలో ఘోరపరాజయం, భారతీయజనతాపార్టీ పాలనలో బయటపడుతున్న కుంభకోణాలు, వివాదాల నేపథ్యంలో బీహార్ ఎన్నికలలో విజయం ఆ పార్టీకి తప్పనిసరై ఉండొచ్చు. బీహార్‌లో ఓడిపోతే త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్, యూపీ ఎన్నిలకపై ఆ ప్రభావం కనబడొచ్చుగాక. అయినాకూడా మోడి ఈ సమయంలో ఆ ప్యాకేజిలను ప్రకటించటం తెంపరితనమనే అనాలి. లలిత్ గేట్ తదితర వివాదాలపై పార్లమెంట్‌లో, బయట నోరు మెదపకపోవటంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండగా, ఇప్పుడు బీహార్‌కు ప్యాకేజి ప్రకటనతో ఆయనపై విమర్శలకు మరింత బలం చేకూరేటట్లుఉంది.
మరోవైపు ఇప్పటికే హామీలిచ్చిఉన్న ఆంధ్రప్రదేశ్, కాశ్మీర్ వంటి రాష్ట్రాలు, మాజీసైనికులు కేంద్రం సాయంకోసం ఆశగా ఎదురుచూస్తుండగా వాటినేమాత్రం పట్టించుకోకపోగా బీహార్‌కు ఇంత ఉదారంగా వరాలు గుప్పించటం ఆ రాష్ట్రాలలో, ఆ మాజీ సైనికులలో ఆగ్రహాన్ని కలిగించే విషయం. ఆంధ్రప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే, గత ఏడాది ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నపుడు విభజనగురించి మోడి ఎంతో ఆర్ద్రతగా మాట్లాడారు మోడి. డెలివరీ చేయటం చేతకాని కాంగ్రెస్ పార్టీ తల్లిని, పిల్లను చంపేసిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని వాగ్దానం చేశారు. ఇప్పుడు ఆ విషయంపై ఏపీలో ఇంత గొడవ రేగుతున్నా పెదవి విప్పటంలేదు. కాశ్మీర్‌లో వరదసాయంకోసం రు.44,000 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. దానికోసం ఆ రాష్ట్ర ప్రజలు చకోరపక్షులలా ఎదురు చూస్తున్నారు. ఒకే హోదా – ఒకే పెన్షన్ హామీ గురించి మాజీ సైనికులు ఎంతోకాలంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
మోడిపై భ్రమలు తొలిగిపోతున్నాయనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాను అవినీతికి పాల్పడనని, తన బృందంలో ఎవరు అవినీతికి పాల్పడినా ఊరుకోనని చెప్పిన మోడి, ఇటీవల బయటపడిన బీజేపీ నేతల అవినీతిపై నోరు మెదపటంలేదు. మరోవైపు నల్లధనాన్ని తిరిగి రప్పిస్తానన్న హామీ ఏమైందో ఎవరికీ తెలియటంలేదు. చాయ్‌వాలానంటూ ప్రచారం చేసుకుని అందరినీ ఆకట్టుకున్న మోడి, పదిలక్షల ఖరీదైన డిజైనర్ సూట్‌లు వేసుకుని వరసగా విదేశ పర్యటనలలో మునిగితేలుతున్నారన్ని విమర్శ ఉండనే ఉంది. భూసేకరణ బిల్లులో మార్పులు, బీమారంగంలో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరవటం, బొగ్గు గనులను ప్రైవేటీకరించటం, ఉపాధిహామీ పథకం(ఎమ్ఎన్ఆర్ఈజీఏ) చట్టాన్ని నీరుగార్చటం వంటి చర్యలు కార్పొరేట్ శక్తుల అడుగులకు మడుగులొత్తేవిగా ఉన్నాయనే వాదనకూడా బలం పుంజుకుంటోంది.
ఏది ఏమైనా నరేంద్రమోడి ఈ సమయం, సందర్భంలో ప్యాకేజిని ప్రకటించటం రాజనీతిజ్ఞత అనిపించుకుంటుందని ఎవరూ అనరు. ఆయనకు బీహార్‌ను ఆదుకోవాలని బలంగా ఉంటే ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఇదే విషయం చర్చకు వచ్చినపుడు ప్రకటింపజేసి ఉండొచ్చు(ఆయన ఈ పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాలేదు). నీతి, నిజాయతీలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకుని ఎన్నికైన మోడి ఇలా ఫక్తు రాజకీయవాదిలాగా ప్రతి విషయాన్నీ ఎన్నికలకోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, వ్యవహరించటం ఆయన స్థాయిని ఆయనే క్రమేణా దించుకున్నట్లుగా భావించాల్సి ఉంటుంది(గతంలో నమాజ్ టోపీని పెట్టుకోవటానికి నిరాకరించిన మోడి ఇటీవల అబూధబిలో మసీదును సందర్శించటం బీహార్‌లో ముస్లిమ్ ఓటర్లను ఆకట్టుకోవటంకోసమేనన్న వాదన వినబడుతోంది). ఈ ప్యాకేజిల ప్రకటన ప్రజాస్వామ్య వ్యవస్థకు తప్పుడు సంకేతాలిచ్చేవిధంగా, సత్సాంప్రదాయాలకు తిలోదకాలిచ్చేదిగా ఉందనటంలే ఏమాత్రం సందేహంలేదు. మోడిపై వ్యక్తిగతంగా ఏ అవినీతి కళంకమూ లేకపోయి ఉండొచ్చు. కానీ దానినే ప్రభుత్వానికి వర్తింపజేయలేము. అలా అనుకుంటే మన్మోహన్ సింగ్‌కు వ్యక్తిగతంగా ఏ కళంకమూలేదని బీజేపీ నేతలే చెబుతారు.