బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ప్రపంచదేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాదని వారు నియంతృత్వం దిశగా వెళ్తున్నారు. ప్రజాబలంతో ప్రధాని అయిన షేక్ హసీనాను తరిమేసిన తర్వాత, అక్కడ అధికారంలోకి వచ్చిన తాత్కాలిక ప్రభుత్వం ఆమె పార్టీ అవామీ లీగ్‌పై అనేక ఆంక్షలు విధించింది. చివరికి ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు.
అవామీలీగ్ పోటీ చేస్తే విజయం సాధిస్తుందా?
బంగ్లాదేశ్‌లో 2024 జూలైలో జరిగిన విద్యార్థి ఉద్యమం ఆ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసింది. 15 ఏళ్లపాటు తిరుగులేని శక్తిగా వెలిగిన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కుప్పకూలడంతో, ఆమె దేశం విడిచి భారత్‌కు రావలసి వచ్చింది. ప్రస్తుతం నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని పాలిస్తోంది. అయితే ప్రజలు ఎన్నుకోని ప్రభుత్వం ఎలా అని ఎన్నికలు జరపాలని డిమాండ్లు వస్తూండటంతో ఫిబ్రవరిలో ఎన్నికలకు సిద్ధమయ్యారు. కానీ అవామీ లీగ్ పై నిషేధం విధించారు. ఇలా ఓ ప్రధాన పార్టీని నిషేధించడం అంటే.. ఫలితాన్ని ముందే నిర్ణయించుకున్నట్లు.
పోటీకి అనుమతి ఇస్తే విజయం సాధిస్తుందా?
ఫిబ్రవరి 2026లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీ చేస్తే బలమైన ప్రభావం చూపుతుంది. సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్నందుకు వ్యతిరేకత ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తుందన్న భావన ప్రజల్లో ఉంది . దేశాన్ని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అక్కడ ప్రధాన శక్తిగా ఎదుగుతోంది. ఈ పార్టీ హసీనాకు వ్యతిరేకంగా రాజకీయాలు చేసిన ఖాలిదా జియా నాయకత్వంలోఉంది. ఆమె అనారోగ్యానికి గురి కావడంతో కుమారుడు తారిక్ రెహమాన్ సుమారు 17 ఏళ్ల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి రాజకీయాలు ప్రారంభించారు.
అవామీ లీగ్ లేకపోతే పోటీ ఎవరి మధ్య?
అవామీ లీగ్ ను ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయడంపై అమెరికా సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ బంగ్లాదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో పోటీకి అవకాశం కల్పించే అకవాశంలేదు. ఎన్నికలు కేవలం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, కొత్తగా పుట్టుకొచ్చిన విద్యార్థి నేతల నేతృత్వంలోని రాజకీయ పక్షాల మధ్యే జరిగే అవకాశం ఉంది. అవామీ లీగ్‌కు దేశవ్యాప్తంగా ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకు ఉంది. వారిని పూర్తిగా దూరం పెడితే ఎన్నికల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఆందోళన ఉంది.
అవామీ లీగ్ పై ప్రస్తుతం భయంకర దాడి జరుగుతోంది. పార్టీ ప్రధాన నాయకులంతా జైలులో ఉండటం లేదా విదేశాల్లో తలదాచుకోవడం వల్ల నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే అవామీ లీగ్ పోటీ చేయని ఎన్నికల్లో ఇతరులదే విజయం.కానీ దాన్ని ప్రజాస్వామ్యం అని మాత్రం ఎవరూ అనరు.
