ఐపీఎల్ టిక్కెట్లు ఉచితంగా ఇవ్వాల్సిందేనని సన్ రైజర్స్ టీం యాజమాన్యాన్ని బెదిరించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎల్ జరుగుతున్న సమయంలో.. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం హెచ్సీఏ అధ్యక్షుడిపై ఆరోపణలు చేసింది. నిబంధనల ప్రకారం పది శాతం టిక్కెట్లు ఇస్తున్నా.. మరో పది శాతం టిక్కెట్లు ఇవ్వకపోతే మ్యాచ్లు జరగనివ్వబోమని హెచ్చరిస్తున్నారని.. బాక్సులకు తాళాలేసి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇలా అయితే తాము వేరే గ్రౌండ్ చూసుకుంటామన్నారు.
SRH చేసిన ఈ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని SRH హెచ్చరించడంతో సీఎం రేవంత్ స్పందించారు. విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు జరిపిన విజిలెన్స్ నిజమేనని నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా సీఐడీ జగన్మోహన్ రావును అరెస్టు చేసింది. ఇతర హెచ్సీఏ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ కోసం స్టేడియంను SRH అద్దెకు తీసుకుంటుంది. ప్రతి మ్యాచ్కు కోటిపైనే చెల్లిస్తుంది.అదనంగా పది శాతం టిక్కెట్లు ఇస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి తాను బ్లాక్ లో అమ్ముకోవడానికి మరో పది శాతం ఉచితంగా ఇవ్వాలని ఇబ్బంది పెట్టారు.
విషయం పెద్దది అయి.. విజిలెన్స్ విచారణ ప్రారంభమవడంతో.. ఒప్పందం ప్రకారమే నడుచుకుంటామని ఎక్స్ ట్రా టిక్కెట్లు అడగబోమని ఒప్పందం రాసిచ్చారు. కానీ విజిలెన్స్ విచారణ ఆయనను వెంటాడింది. ఇప్పుడు అరెస్టు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ ముఖ్య నేతలకు అత్యంత సన్నిహితుడు.