సినిమా అనేది 24 విభాగాల సమష్టి కృషి. మంచి సినిమా తీయాలన్న కసితో హీరో, దర్శకుడు, నిర్మాత.. వీళ్లంతా కిందా మీదా పడుతుంటారు. సినిమాకు సంబంధించి ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా తప్పు లేదు. ఎందుకంటే ఫైనల్ గా అవుట్ పుట్ బాగా రావాలి అంతే. కానీ సినిమాకు సంబంధం లేని వ్యక్తులు క్రియేటీవ్ వర్క్ లో ఇన్వాల్వ్ అయితే, అందుకు హీరోగారు కారణం అయితే..? ఆ సినిమా చేస్తున్న దర్శకుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవొచ్చు.
ఓ హీరోగారి కుటుంబం నుంచి వారసత్వం అందిపుచ్చుకొని, హీరో అయిన అబ్బాయిగారి కథ ఇది. ఆయకు సరైన విజయాలు లేవు. ఎలాగైనా సరే, నిరూపించుకోవాలన్న ఆత్రం అయితే ఉంది. ప్రస్తుతం ఓ సినిమా సెట్స్ పై ఉంది. ఆ సినిమా అటూ ఇటూ అయితే మాత్రం హీరోగారి కెరీర్ పూర్తిగా అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి… అన్నిరకాల జాగ్రత్తలూ తీసకొంటూ సినిమాని ముందుకు నడిపిస్తున్నారు. కథలో, స్క్రిప్టులో మధ్యమధ్యలో మార్పులూ చేర్పులూ చేసుకొంటున్నారు. ఇందులో తప్పేం లేదు.
కానీ ఆ హీరోగారికి ఓ దర్శకుడితో మంచి అనుబంధం ఉంది. అందుకే ఫుటేజీ మొత్తం తీసుకెళ్లి ఆయన ముందు పెట్టి.. ‘మీ అభిప్రాయం చెప్పండి’ అని సలహాలు అడుగుతున్నాడట. అక్కడి వరకూ కూడా ఓకే. కానీ ఆ దర్శకుడి ఇన్ పుట్స్ తీసుకొని, మళ్లీ సెట్ కి వెళ్లి.. రీ షూట్లు, రీ ఎడిట్ లూ చేస్తున్నాడట. ఇదంతా చూసి ఆ సినిమా తీస్తున్న దర్శకుడు కిందా మీదా అవుతున్నాడు. ‘ఈ సినిమాకు దర్శకుడ్ని నేనా..? ఆయనా?’ అని సన్నిహితులతో చెప్పుకొని బాధ పడుతున్నాడని టాక్. కానీ హీరో దగ్గర, నిర్మాత దగ్గర మాత్రం తన బాధ చెప్పుకోలేకపోతున్నాడు. ఈ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడి వరకూ వెళ్తుందో అని ఆయన భయపడిపోతున్నాడు. మరి.. ఆ దర్శకుడి గోడు హీరోగారికి అర్థం అవుతుందో లేదో?
