పుష్కర స్నానానికి విజయవాడ వచ్చిన నటుడు శివాజీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి హెచ్చరిక జారీ చేశాడు. తన విషయంలో వైకాపా అభిమానులు మాట్లాడుతున్న మాటలు సరికాదంటూ.. అలా మాట్లాడటం వారికి, జగన్ కు మంచిది కాదని శివాజీ హెచ్చరించాడు. ఇంతకీ శివాజీ ఎందుకు వైసీపీ అభిమానులను హెచ్చరించాడు అంటే.. వారు ఈయనను కులం పేరుతో పిలుస్తున్నారట, ఈ నటుడికి కులాన్ని అంటగడుతున్నారట… దీంతోనే శివాజీ ఆగ్రహం వ్యక్తం చేసి, హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
ప్రత్యేకించి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లను శివాజీ ప్రస్తావించాడు. తను తన కులం కోసం పోరాడటం లేదని, రాష్ట్రం కోసం పోరాడుతున్నా అని శివాజీ వ్యాఖ్యానించాడు. కానీ తనను కులం పేరుతో ప్రస్తావిస్తున్నారని, చంద్రబాబు ఇంటి ముందే ఉరి వేసుకొంటా.. అని తను చేసిన వ్యాఖ్యానాన్ని పట్టుకుని..కొంతమంది ఫేస్ బుక్ లో ‘ఉరి తాడు తెచ్చుకోవడానికి ఉగాండా వెళ్లాడు..’ అని కామెంట్లు పెడుతున్నారని.. శివాజీ వ్యాఖ్యానించాడు.
ఏదేమైనా.. శివాజీ ఇలా వైకాపా వాళ్లను హెచ్చరించడం ఆసక్తికరమైన అంశమే. ప్రత్యేకహోదా విషయంలో చేసిన వ్యాఖ్యల ద్వారా శివాజీ ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్నాడు. ఇటీవల యూఎస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తను కూడా చంద్రబాబు అభిమానినే అని, చంద్రబాబు రాష్ట్రం కోసం బాగా కష్టపడుతున్నాడని కితాబులిచ్చాడు. ఇప్పుడు వైకాపా వాళ్ల కు హెచ్చరికలు జారీ చేశాడు.