హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ పట్టుబడిన ఓ డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడి వ్యవహారం బయటపడినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మాసబ్‌ట్యాంక్ పోలీసులు ,తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన ఈగల్ టీం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే ఇద్దరు వ్యాపారవేత్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన క్రమంలో, వారు ముంబైకి చెందిన నైజీరియన్ కార్టెల్ నుండి డ్రగ్స్ సేకరించి హైదరాబాద్‌లోని హై-ప్రొఫైల్ కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు తేలింది.
అరెస్ట్ అయిన నిందితుల వాంగ్మూలం ప్రకారం, వారికి నలుగురు రెగ్యులర్ కస్టమర్లు ఉండగా, అందులో ఒకరు హీరోయిన్ సోదరుడిగా గుర్తించారు. నిందితుల నుంచి 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల MDMA డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ డెలివరీ చేసే లోపే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న హీరోయిన్ సోదరుడు పరారయ్యాడని పోలీసులు చెబుతున్నారు.
గత ఏడాది జూలైలో కూడా సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో కూడా హీరోయిన్ సోదరుడు పట్టుబడ్డారు. అప్పట్లో నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆ కేసులో బెయిల్‌పై ఉన్న ఆయన, మళ్ళీ తాజా కేసులో పేరు రావడంతో పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలు ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఈ కేసులో ముంబైకి చెందిన ఆఫ్రికన్ జాతీయుల ప్రమేయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళా స్మగ్లర్లు ముంబై నుండి హైదరాబాద్‌కు బస్సుల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ నెట్వర్క్ ఎంత లోతుగా ఉందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
