హైరైజ్ అపార్టుమెంట్లు కొనుగోలు చేసేటప్పుడు, ప్రకటనల్లో చూపించే మొత్తం ధరకు అదనంగా వివిధ ఛార్జీలు, పన్నులు, ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇవి ఇంటి కొనుగోలు ప్రణాళికల్ని దెబ్బతీస్తాయి. అప్పుల పాలు చేస్తాయి. ఉదాహరణకు యాభై లక్షలు పెట్టి అపార్టుమెంట్ కొంటే.. మరో ఇరవై లక్షల వరకూ అదనంగా ఖర్చులు అవుతాయి. అంటే 70 లక్షల బడ్జెట్ ఉన్న వాళ్లు రూ.50 లక్షల విలువైన ఇల్లు కొనుగోలు చేయాలన్నమాట.
ఆస్తి కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ తప్పదు. ఆ ఖర్చు గురించి కూడా ఆలోచించాలి. ఇక బిల్డప్ వైపు నుంచి వసూలు చేసే అదనపు ఖర్చులు చాలా ఉంటాయి. మొదటిది జీఎస్టీని అండర్-కన్స్ట్రక్షన్ అపార్టుమెంట్లకు జీఎస్టీవర్తిస్తుంది. సిద్ధం అయిన ఇళ్లకు జీఎస్టీని ఉండదు.కానీ నిర్మాణంలో ఉన్న వాటికి కార్పెట్ ఏరియాపై ఐదు శాతం జీఎస్టీని చెల్లించాల్సిందే. అంటే దాదాపుగా రెండున్నర లక్షలు అవుతుంది.
ఇక ప్రిఫరెన్షియల్ లొకేషన్ చార్జ్ లు ఉంటాయి. కార్నర్, పార్క్-ఫేసింగ్, రోడ్-ఫేసింగ్ లేదా హై ఫ్లోర్లకు అదనంగా వసూలు చేస్తారు. ఇది రెండు నుంచి పది శాతం వరకూ అదనంగా ఉంటుంది. ఫ్లోర్ రైజ్ చార్జ్ కూడా వసూలు చేస్తారు. అంతస్తు పెరిగే కొద్దీ రేటు పెంచుతారు. ఒకటి, రెండు శాతం అదనంగా వసూలు చేస్తారు. కవర్డ్/ఓపెన్ పార్కింగ్ స్పాట్ కోసం. ప్రత్యేకంగా చెల్లించాలి. ఇది లక్షల్లోనే ఉంటుంది. క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలకు ఒక్కసారి ఫీజు చెల్లించాలి. ఇది కూడా లక్ష వరకూ ఉటుంది. మొదటి 1-2 సంవత్సరాల మెయింటెనెన్స్ చార్జీలు ముందేచెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక లక్ష దాకా అవుతుంది.
అంటే డెవలపర్-సంబంధిత ఛార్జీలు , ప్రభుత్వ ఫీజులు ఉంటాయి. ఇక ఇంటీరియర్ గురించి చెప్పాల్సిన పని లేదు. అది ఇంటి బడ్జెట్ లో సగం అయ్యేలా అభిరుచులు మారుతున్నాయి. అందుకే ఇల్లు కొనుగోలుకు మీ దగ్గర ఉండే బడ్జెట్లో కనీసం అరవై శాతం వరకూ మాత్రమే విలువ ఉండే ఇంటిని కొనుగోలు చేయాలి. మీ దగ్గర యాభై లక్షలు ఉన్నాయని.. యాభై లక్షల విలువైన ఇంటిని కొంటే..పాతిక లక్షల వరకూ అప్పులు చేయాల్సి వస్తుంది.