ఈవారం విడుదల అవుతున్న సినిమాల్లో ‘మిరాయ్’ ఒకటి. హనుమాన్ తరవాత తేజా సజ్జా నుంచి వస్తున్న సినిమా కాబట్టి సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. మంచు మనోజ్ విలన్ గా కనిపించడం, ట్రైలర్ లో చూపించిన వీఎఫ్ఎక్స్ ఆకట్టుకొనే స్థాయిలో ఉండడం ఈ సినిమా గురించి ఇంకొంత మాట్లాడుకొనేలా చేశాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన సినిమాలు ఈమధ్య బాక్సాఫీసు దగ్గర బోల్తా కొడుతున్న సందర్భంలోనూ.. ‘మిరాయ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. పెట్టుబడిలో దాదాపు 60 శాతం నాన్ థియేట్రికల్ రూపంలోనే తిరిగి వచ్చేశాయి.
బుక్ మై షోలో.. మిరాయ్ కు మంచి నెంబర్లే కనిపిస్తున్నాయి. ఓపెనింగ్ మంచి నెంబర్ తీసుకొనే అవకాశం ఉంది. మౌత్ టాక్ బాగుంటే ఇక వెనక్కి తిరిగి చూడక్కర్లెద్దు. ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజులు ఉన్నాయని చిత్రబృందం ఊరిస్తోంది. అందులో రాముడి ఎంట్రీ ఒకటి. ట్రైలర్ లో కొంత హింట్ ఇచ్చినా, రాముడు ఎవరన్నది చెప్పలేదు. బహుశా.. వీఎఫ్ఎక్స్ లో సృష్టించిన రాముడు కావొచ్చు. లైవ్ లోనూ ఆ పాత్ర కనిపించబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఆశోకుడి పాత్ర కూడా ఈ కథకు కీలకం. ఆ పాత్రలో ఓ హీరో కనిపించబోతున్నాడని టాక్. క్లైమాక్స్ లో ఈ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, అక్కడి నుంచి పార్ట్ 2కి లీడ్ దొరుకుతుందని తెలుస్తోంది.
అంతేకాదు.. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి `వైబ్ ఉంది` పాట ఒక్కటే బయటకు వచ్చింది. మరో పాట కూడా ఈ సినిమాలో ఉంటుందని, అది సర్ప్రైజింగ్ ప్యాకేజీ అని తెలుస్తోంది. ఆ పాటలో ఓ కథానాయిక కనిపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి మిరాయ్ కోసం చాలా సర్ప్రైజులు దాగి ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తే కొన్న టికెట్ రేటుకు డబుల్ వినోదం దొరికినట్టే.