కేబినెట్ మంత్రి నేరుగా ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసి ఇంకా ఆయన కేబినెట్ లో మంత్రిగా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. ముఖ్యమంత్రిపై విశ్వాసం లేనప్పుడు వెంటనే ఆయన మంత్రి వర్గం నుంచి వైదొలగాలి. కానీ కాంగ్రెస్ విషయంలో అంతా భిన్నంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబంపై కొండా సురేఖ కుమార్తె తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు నేరుగా కొండా సురేఖ చేసినట్లే. అయినా హైకమాండ్ మాత్రం కొండా సురేఖ విషయంలో బుజ్జగింపులకు ప్రాధాన్యం ఇస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.ఇది రేవంత్ రెడ్డిపై అంటే కాంగ్రెస్ పార్టీ సీఎంపై దాడి చేసే వారికి పరోక్షంగా ప్రోత్సాహం కల్పించడమే.
రేవంత్ రెడ్డి ని వ్యతిరేకిస్తున్న వారికి హైకమాండ్ సపోర్ట్
కారణం ఏదైనా కానీ రేవంత్ రెడ్డిని వ్యూహాత్మకంగా బలహీనపరచాలని హైకమాండే గట్టిగా ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిపై ఎటాక్ చేసే సొంత పార్టీ నేతలకు కనీస హెచ్చరికలు జారీ చేయకపోవడంతో అలాంటి వారు పెరుగుతున్నారు. మంత్రి పదవి ఇవ్వలేదని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ..రేవంత్ పై నేరుగా దాడి చేస్తున్నారు. కానీ ఆయనకు హెచ్చరిక కూడా జారీ చేయలేదు. ఆయన ఇప్పుడు సొంత విధానపరమైన నిర్ణయాలను ప్రకటించి.. ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారు. ఆయన స్ఫూర్తిగా కొండా సురేఖ కూడా తెరపైకి వచ్చారు. ఇలాంటి వారి పట్ల హైకమాండ్ సానుకూలంగా వ్యవహరిస్తుంది. రేవంత్ రెడ్డిని విమర్శించేవారికి తమ సానుభూతి ఉంటుందని సంకేతాలు పంపుతున్నారు.
రేవంత్ ను బలహీనం చేస్తే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనే!
సీఎం రేవంత్ రెడ్డిని బలహీనం చేస్తే ఎవరికి నష్టం ?. ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మూడో స్థానంలో ఉంది. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడ్ని మార్చడం వల్ల ఏర్పడిన పరిస్థితుల్ని రేవంత్ రెడ్డి చాలా బాగా అవకాశంగా తీసుకుని పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. ఎంతో మంది వెనక్కి లాగే వాళ్లు ఉన్నప్పటికీ .. మొండిధైర్యంతో ముందుకెళ్లి విజయాన్ని సాధించిపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సోనియా గాంధీని.. రాహుల్ గాంధీని చూసి ఓట్లేసారని ఎవరూ అనుకోరు. అలా ఓట్లేసేవారు అయితే.. తెలంగాణ ఇచ్చి కూడా రెండు సార్లు ఓడిపోయేవారు కాదు.
కానీ ఆ విషయాన్ని కాంగ్రెస్ గుర్తించలేకపోతోంది. రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా బలహీనం చేయాలనుకుంటోంది.
రేవంత్ కన్నా పార్టీ లైన్ దాటే వాళ్లు అంటేనే ఎక్కువ ఇష్టమా ?
ఓటు చోరీ విధానాలపై తన అభిప్రాయం చెప్పినందుకు కర్ణాటక మంత్రిని అప్పటికప్పుడు పదవి నుంచి తప్పించారు రాహుల్. మరి అదే ఫార్ములా తమ పార్టీని రాష్ట్రంలో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గౌరవాన్ని కాపాడేందుకు ఎందుకు అన్వయింపచేయరు?. ఆయనపై ఆరోపణలు చేస్తూ .. ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్న వారికి ఎందుకు అండగా ఉంటున్నారు?. ఆరోపణల తీవ్రత దృష్ట్యా చూస్తే కొండా సురేఖను అప్పటికప్పుడు బర్తరఫ్ చేయాలి. కానీ ఆమెను పిలిచి గంటల తరబడి బుజ్జగించారు. మంత్రి పదవికి ఢోకా లేదని భరోసా ఇచ్చారు. ఫలితంగా ఇప్పుడు కాంగ్రెస్ లో అలాంటి వారు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని .. నేతలు చింపిన విస్తరి చేయడానికి హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణం అనుకోవచ్చు.