రాజకీయ పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ వన్ ను హైకోర్టు కొట్టి వేసింది. ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో నెం.1ను సవాల్ చేస్తూ హైకోర్టులో సీపీఐ నేత రామకృష్ణ పిటిషన్ వేశారు. రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందన్న పిటిషన్ల న్యాయవాది వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీవో ఇచ్చారని పోలీస్ యాక్ట్ 30కు భిన్నంగా జీవో నెం.1 జారీ చేశారని రామకృష్ణ తరపు న్యాయవాది వాదించారు. ప్రజల ప్రాథమిక హక్కును హరించేలా జీవో ఉందని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. వీటితో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది.
ఈ జీవో జారీ చేసినప్పుడు హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. అప్పుడు విచారించిన వెకేషన్ బెంచ్ ఈ జీవోపై స్టే ఇచ్చింది. అయితే తర్వాత విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ బెంచ్.. ఆ స్టేను పొడిగించడానికి నిరాకరించింది. తీర్పును రిజర్వ్ చేసింది. చాలా కాలం పాటు తీర్పు ఇవ్వకపోవడంతో రామకృష్ణ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. త్వరగా తీర్పు ఇవ్వాలని హైకోర్టులోనే కోరాలని.. తీర్పు వచ్చే వరకూ స్టే ఇవ్వాలని హైకోర్టును కోరాలని పిటిషనర్ రామకృష్ణకు సుప్రీంకోర్టు సూచించింది. అయితే హైకోర్టు తీర్పు వెలువరించింది.
చంద్రబాబు నిర్వహించిన రెండు వరుస సభల్లో తొక్కిసలాటలు జరిగాయి. అలా జరుగుతాయని తెలుసన్నట్లుగా హుటాహుటిన జీవో జారీ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకున్నారు. తర్వాత ఆనపర్తిలోనూ అడ్డుకున్నారు. ఈ జీవో కారణం చూపి లోకేష్ పర్యటనపై ఆంక్షలు విధించారు. ఇటీవల హోంశాఖపై సమీక్ష జరిపిన సీఎం జగన్ జీవో వన్ సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు హైకోర్టు ఆ జీవోను కొట్టి వేయడంతో ప్రజాస్వామ్య విలువలను కాాపాడినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.