పవన్ కల్యాణ్ ను ఎలాగైనా నిందిద్దామని కోర్టులను సైతం వాడేసుకుంటున్న వైసీపీ నేతలకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో రాజకీయం చేయడంపై మండిపడింది. ప్రజల కోసం పనికి వచ్చే పిటిషన్లను పిల్ రూపంలో వేయాలని సూచించింది.
పవన్ కల్యాణ్ ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ.. ఓ వైసీపీ సానుభూతిపరుడు హైకోర్టును ఆశ్రయించారు. అలా పెట్టడం తప్పని నిబంధనలు ఉల్లంఘించారని ఆయన వాదన. డిప్యూటీ సీఎం ఫోటో పెట్టకూడదన్న రూల్ ఎక్కడ ఉందో చెప్పాలని హైకోర్టు లాయర్ ను ప్రశ్నించింది. కానీ ఆయన వద్ద సమాధానం లేదు. దాంతో హైకోర్టు రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారని కొట్టి వేసింది.
పవన్ ను ఏదో విధంగా తప్పు పడదామని.. హైకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు వైసీపీ సానుభూతిపరులు. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత వైసీపీ ప్రభుత్వం కట్టివేస్తే.. దానిపై పిటిషన్ వేశారు. పవన్ సినిమాల్లో నటిస్తున్నారంటూ ఓ పిటిషన్ వేయించారు. ఫోటో పెట్టారంటూ మరో పిటిషన్ వేయించారు. అయితే అన్నీ నిలబడేవి కావు. కోర్టులు నోటీసులు జారీ చేస్తే.. అదే పెద్ద విషయం అని రాజకీయంగా ప్రచారం చేయడానికి ఈ పిటిషన్లు వేస్తున్నారు. అన్నింటిలోనూ ఎదురు దెబ్బలు తింటున్నారు.