తమిళ సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా రూపొందిన జననాయగన్ చిత్రం విడుదలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సినిమాకు మొదట యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని హైకోర్టు సింగల్ బెంచ్ ఆదేశించింది. ఆయితే వెంటనే సెన్సార్ బోర్డు సభ్యుడు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది. దీంతో కనీసం పధ్నాలుగో తేదీన అయిన సినిమా విడుదల చేయాలనుకున్నా సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ రావడంలో జాప్యం జరగడంతో, నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సెన్సార్ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని, ఆర్మీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు , మతపరమైన అంశాలపై అభ్యంతరాలను సెన్సార్ బోర్డు వ్యక్తం చేస్తోంది.
ఈ సినిమాకు మొదట యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చేందుకు ఎగ్జామినింగ్ కమిటీ మొగ్గు చూపినప్పటికీ, కమిటీలోని ఒక సభ్యుడు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బోర్డు ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ చిత్రాన్ని మళ్లీ రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. ఈ జాప్యం వల్ల తమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. సింగిల్ బెంచ్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వెలువడిన ఈ పరిణామాలతో థియేటర్ల వద్ద ఇప్పటికే హంగామా మొదలుపెట్టిన అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ప్రస్తుతానికి సినిమా విడుదల వాయిదా పడిందని, కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. సుమారు 5,000 స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం చుట్టూ రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని తమిళ మీడియాలో చర్చ జరుగుతోంది.
