తెలుగుదేశం పార్టీ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ మే 5న జరుగుతుంది. అయితే ..తనకు రిమాండ్ విధిస్తూ ఇచ్చిన ఆదేశాలపై ధూళిపాళ్ల నరేంద్ర మరో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని మాత్రం హైకోర్టు కొట్టి వేసింది. ధూళిపాళ్ల నరేంద్ర ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నారు. ఆయన జైల్లో ఉన్న సమయంలోనే.. సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సహకార శాఖ పరిధిలోకి మార్చి .. తెనాలి సబ్ కలెక్టర్‌కు రోజువారీ వ్యవహారాలు చూసే బాధ్యత అప్పగించింది. ఆ సబ్ కలెక్టర్ సంగం డెయిరీ ఆఫీసులో కూర్చుకుని మొత్తం వ్యవహారాలు చక్క బెడుతున్నారు.
మరో వైపు సంగం డెయిరీ డైరక్టర్లందరూ.. కొత్త చైర్మన్‌ను ఎన్నుకున్నారు. ప్రభుత్వం అన్యాయంగా స్వాధీనం చేసుకుందని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది. తన అరెస్ట్ అక్రమం అని.. కోర్టు స్టేలో ఉన్న ఆరోపణలను కొత్తగా కేసులుగా నమోదు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఏసీబీ చెబుతున్నవి అక్రమాలు కాదని.. ఆయన అంటున్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ ఇచ్చిన జీవో చెల్లదని.. న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పదని ధూళిపాళ్ల వర్గీయులు చెబుతున్నారు. సంగం డెయిరీ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఓ వైపు అమూల్ సంస్థ వైపు సంగం డెయిరీకి చెందిన రైతుల్ని నెట్టేందుకు… సంగం డెయిరీ నుంచి అందే సౌకర్యాలను నిలిపివేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరో వైపు యాజమాన్యాన్ని ప్రభుత్వం బలవంతంగా మార్చేసింది. ఈ సమయంలో ప్రభుత్వం అనుకున్న ఎఫెక్ట్ వస్తుందని.. వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. రైతులు ఈ పరిణామాలన్నింటిపై గందరగోళంలో ఉన్నారు. రేపు కోర్టులో.. ధూళిపాళ్లపై పెట్టిన కేసులు.. అసత్యమని తేల్చినా… జరిగిన నష్టం మాత్రం.. శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది. అది సంగం డెయిరీ పునాదుల్ని దెబ్బతీయవచ్చని అంటున్నారు.